ప్రభాస్ చిత్రానికి వర్క్ చేయకపోవడానికి కారణమిదే: థమన్

Wed Nov 24 2021 05:00:01 GMT+0530 (IST)

Thaman missed Prabhas film due to him

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గత రెండేళ్లుగా ఎంతటి ఫార్మ్ లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలు - స్టార్ డైరెక్టర్స్ కు ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయిన తమన్.. ప్రస్తుతం డజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉన్నారు. చిరంజీవి - నాగార్జున - బాలకృష్ణ - వెంకటేష్ వంటి సీనియర్ హీరోల సినిమాలతో పాటుగా మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ - ఎన్టీఆర్ - రామ్ చరణ్ - అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల చిత్రాలకూ థమన్ సంగీతం సమకూర్చారు. అయితే సంగీత దర్శకుడు ఇప్పటి వరకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాకి వర్క్ చేయలేదు. ఇదే విషయంపై థమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రభాస్ సినిమాకు సంగీతం అందించే అవకాశం వస్తుందని థమన్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాను 'రెబెల్' చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేయాల్సిందని.. కానీ ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్లిపోయానని తెలిపారు. దీనికి కారణం ఆ సినిమాకు డైరెక్టర్ లారెన్స్ సంగీతం అందించాలనుకోవడమే అని వెల్లడించారు. దర్శకుడు మ్యూజిక్ చేయాలని అనుకున్నప్పుడు తను చేసేదేమీ లేదని.. అందుకే బయటకు వచ్చేశానని చెప్పారు. అయితే ప్రభాస్ తో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని తమన్ మనసులోని మాటను బయటపెట్టారు. అయితే ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా మేకింగ్ వీడియోకు థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. మరి త్వరలో సినిమాకు సాంగ్స్ కూడా అందించే ఛాన్స్ దక్కించుకుంటారేమో చూడాలి.

ఇకపోతే థమన్ ఈ సందర్భంగా తను సంగీతం సమకూర్చిన అప్ కమింగ్ రిలీజ్ 'అఖండ' సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. ''ఇప్పటి వరకు నా బెస్ట్ వర్క్ 'అఖండ'. అది నేను నమ్మకంగా చెప్పగలను. ఈ సినిమా చాలా డిమాండ్ చేసింది. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. ఇందులో చాలా సైన్స్ కూడా ఉంది. అఘోర అంటేనే సైన్స్. అఘోర పాత్రల మీద చాలా రీసెర్చ్ చేశాను. పుస్తకాలు చదివాం. ఆ పాత్రలకు తగ్గట్టుగానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టాం. చాలా బాగా వచ్చింది. ఈ కథ నెవ్వర్ బిఫోర్ అని.. నెవ్వర్ అగైన్ అని కూడా చెప్పొచ్చు. టైటిల్ సాంగ్ విని బాలయ్య గారు మెచ్చుకున్నారు'' అని థమన్ చెప్పారు.

'అఖండ' సినిమాకు దాదాపు ఐదారు వందల మంది పని చేశారు. చాలా ప్రయోగాలు చేశాం. కేవలం సింగర్లే 120 మంది వరకు ఉంటారు. సినిమాలో అఘోర పాత్ర ఎంట్రీ ఇవ్వడంతో రేంజ్ మారిపోతోంది. వేరే జోన్ లో ఉంటుంది. సినిమా చూసి మా టీమ్ అంతా కూడా చాలా హైలో ఉన్నామని థమన్ చెప్పుకొచ్చారు.