Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : తెనాలి రామకృష్ణ

By:  Tupaki Desk   |   15 Nov 2019 9:39 AM GMT
మూవీ రివ్యూ : తెనాలి రామకృష్ణ
X
‘తెనాలి రామకృష్ణ’ మూవీ రివ్యూ
నటీనటులు: సందీప్ కిషన్-హన్సిక-వరలక్ష్మి శరత్ కుమార్-మురళీ శర్మ-వెన్నెల కిషోర్-సప్తగిరి-అయ్యప్ప శర్మ-పోసాని కృష్ణమురళి-రఘుబాబు తదితరులు
సంగీతం: సాయికార్తీక్
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్
కథ: రాజసింహా
మాటలు: భవానీ ప్రసాద్-నివాస్
నిర్మాతలు: నాగభూషణ్ రెడ్డి-సంజీవరెడ్డి-రూప జగదీష్-శ్రీనివాస్ఇందుమూరి
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి

హిట్టు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న యువ కథానాయకుడు సందీప్ కిషన్. గతంలో కామెడీ సినిమాలతో మంచి విజయాలందుకుని.. ఆ తర్వాత ట్రాక్ తప్పిన జి.నాగేశ్వర్ రెడ్డి సందీప్‌ను హీరోగా పెట్టి తీసిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ ఎల్ఎల్బీ’. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: తెనాలి రామకృష్ణ (సందీప్ కిషన్) కర్నూలులో ఒక ఛోటా లాయర్. కేసుల కోసం డిస్కౌంట్లు, ఆఫర్లు ఇచ్చినా కూడా ఫలితం ఉండదు. అతడికి కేసులే రావు. దీంతో కోర్టులో వాదించడం మానేసి.. బయట కేసులు రాజీలు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. ఐతే ఎలాగైనా ఒక పెద్ద కేసు చేజిక్కించుకుని దాన్ని గెలిచి తనేంటో రుజువు చేసుకోవాలనుకుంటున్న తరుణంలో.. హత్య కేసులో చిక్కుకున్న వరలక్ష్మి (వరలక్ష్మి శరత్ కుమార్) అనే బిగ్ షాట్ మీద జరిగిన కుట్ర గురించి తెనాలికి తెలుస్తుంది. దీంతో ఆ కేసును మీద దృష్టిసారిస్తాడు తెనాలి. మరి అతను ఈ కేసును ఎలా పరిష్కరించి వరలక్ష్మిని బయటికి తీసుకొచ్చాడు.. ఈ క్రమంలో అతడికి ఎదురైన అడ్డంకులేంటి అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: ‘‘ఒరేయ్.. నా కళ్లలో చూస్తే స్ట్రెస్ పోతుందని చెప్పావ్ కదా. నీ మాట నమ్మి ఒక పెద్దాయనికి చూపించా’’ అంటుంది అమ్మాయి. ఏం చూపించావ్ అంటాడు అవతలి వ్యక్తి. ‘కళ్లురా కళ్లు’’ అని ఒత్తి పలుకుతుంది అమ్మాయి. ఇంకో జోక్ చూద్దాం.. లేడీ గెటప్‌లో ఉన్న చమ్మక్ చంద్ర ‘‘మాకు సంసారం ఉంది కానీ.. సుఖ సంసారం లేదు. మీరే మా ఆయన్ని మార్చాలి.. మాది నిలబెట్టాలి’’ అంటూ ఒక అసభ్యకరమైన సంజ్ఞ చేస్తాడు. ఎదుటి వ్యక్తి ఏం నిలబెట్టాలని షాకయ్యి అడిగితే ‘‘సంసారం’’ అని జవాబు. అదే వ్యక్తి నీకేంటి ఇంతమంది మొగుళ్లున్నారని అడిగితే.. ‘‘నాది చాలా విశాలం’’ అని సమాధానం. అదేంటి అని అడిగితే... ‘‘మనసు’’ అని జవాబట. ‘తెనాలి రామకృష్ణ’ సినిమా రివ్యూలో ఈ జబర్దస్త్ జోకుల గురించి డిస్కషన్లేంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇవన్నీ సినిమాలో ఉన్న జోకులే మరి. ఇవన్నీ జబర్దస్త్‌లో ఎప్పట్నుంచో చూస్తున్నవే కదా.. మళ్లీ సినిమాలో ఎందుకు అంటే ఏమీ సమాధానం చెప్పలేం.

‘జబర్దస్త్’లో పైన చెప్పుకున్న తరహా జోకుల్ని ఆస్వాదించగలిగే వాళ్లు ఈటీవీలో.. యూట్యూబ్‌లో ఫ్రీగా ఖాళీ ఉన్నపుడు చూసుకుంటారు. కానీ వీటి కోసం పనిగట్టుకుని డబ్బులుపెట్టి థియేటర్లకు వెళ్తారా? అయినా సినిమాలో ఈ టైపు జోకులు మధ్యలో ఇలా వచ్చి అలా వెళ్లిపోతే సరేలే అనుకోవచ్చు. కానీ కథలో లేక లేక ప్రేక్షకుడు కాస్త కథలో సీరియస్ గా ఇన్వాల్వ్ అయిన దశలో హీరోను.. మిగతా ప్రధాన పాత్రధారుల్ని వెనక్కి నెట్టి మరీ కామెడీ గ్యాంగుతో ‘జబర్దస్త్’ స్కిట్‌ ను ప్రవేశపెడితే ప్రేక్షకుల ఫీలింగ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. టీవీల్లో, మొబైళ్లలో ఎంజాయ్ చేసే జబర్దస్త్ స్కిట్లు, జోకుల్ని సినిమాల్లో పెడితే వర్కవుట్ కాదని ఇప్పటికే చాలాసార్లు రుజువైనా సరే.. మళ్లీ మళ్లీ దర్శకులు అదే తప్పు చేస్తున్నారు. ఒకప్పుడు కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న జి.నాగేశ్వరరెడ్డి కూడా ట్రెండ్ కు తగ్గట్లు అప్ డేట్ కాక ‘జబ్దరస్త్’ కామెడీని నమ్ముకుని ‘తెనాలి రామకృష్ణ’ను అథోగతిపాలు చేశాడు.

కేసుల్లేక కష్టపడుతున్న ఒక ఛోటా లాయర్.. ఒక మర్డర్ మిస్టరీ కేసును టేకప్ చేయడం.. ఒక బడా లాయర్ ను ఢీకొట్టడం.. ఈ సెటప్ అంతా చూసి ‘జాలీ ఎల్ఎల్బీ’ లాంటి క్లాసిక్ మూవీని గుర్తు చేసుకుంటాం. కేసు వాదనల్లో ఎత్తులు పై ఎత్తులతో.. డ్రామాతో.. ఉత్కంఠతో కథనం రక్తి కడుతుందని ఆశిస్తాం. కానీ కేవలం సెటప్ వరకు ‘జాలీ..’ని స్ఫూర్తిగా తీసుకుని దీనికి అస్సలు సరిపడని నేలబారు కామెడీతో నింపేసి సినిమాను నీరుగార్చేశాడు నాగేశ్వరరెడ్డి. హీరో బైక్ నడుపుకుంటూ రావడం.. బ్రేకులు ఫెయిలవడం.. హీరోయిన్ తండ్రిని ఢీకొట్టడం.. బండి మీద ఇరుక్కుపోవడం.. సపోర్ట్ కోసం రోడ్డు మీద పోతున్న మహిళ చీర కొంగు పట్టుకోవడం.. ఆమెను కాపాడ్డానికి మగాళ్లు పోటీ పడటం.. మరోపక్క ‘ఏవండీ మీ మధ్యప్రదేశ్ బాగానే ఉందా.. దానికేం కాలేదు కదా’ అని భార్య కంగారు పడటం.. 20 ఏళ్ల కిందటే ఔట్ డేట్ అయిపోయిన ఈ తరహా సీన్లతో ఈ రోజుల్లో కామెడీ పండించాలని చూసిన నాగేశ్వరరెడ్డిని ఏమనాలో అర్థం కాదు.

కేఏ పాల్ ఆ మధ్య టీవీలో కూర్చుని ఒక పాట పాడాడు గుర్తుందా? ఒక సీన్లో దాన్ని అనుకరిస్తూ సత్యకృష్ణతో కామెడీ చేయించారు. ఇంకో సీన్లో విలన్ పాత్రధారి జైలుకెళ్తే నా రాజకీయ జీవితం ఏమవుతుందో అని కంగారు పడితే.. జైలుకెళ్తేనే రాజకీయ జీవితం పునాది బలంగా ఉంటుందంటాడు లాయర్. మరో సీన్లో విలన్ మీద ఓ వ్యక్తి కోడి కత్తితో దాడి చేస్తాడు. ఓ సీన్లో హీరో ఒక ఇంటికి వెళ్తే.. ‘ఏం బాబూ గ్రామ వాలంటీర్.. సరుకులు తెచ్చావా’ అని అడుగుతారు. తమది ‘కంటెంపరరీ’ సినిమా అని ఒప్పించడానికి జరిగిన ప్రయత్నాలు ఇవన్నీ. ఇన్నీ చేసి ఒక పాత చింతకాయ పచ్చడి కథను తీసుకుని.. రొటీన్ కథనంతో.. ఔట్ డేటెడ్ కామెడీతో నింపేశారు. ప్రథమార్ధం పూర్తిగా తేలిపోగా.. ద్వితీయార్ధంలో కథలోని మలుపులు ప్రేక్షకుల్ని సినిమాలో ఇన్వాల్వ్ చేయించే ప్రయత్నం చేసినా.. వెంటనే ఆ సీరియస్నెస్ మొత్తం పోయేలా జబర్దస్త్ కామెడీని తీసుకొచ్చి కథను పక్కదారి పట్టించేశారు. మాస్ ప్రేక్షకులు అక్కడక్కడా నవ్వుకునే కొన్ని కామెడీ సీన్లు మినహాయిస్తే ‘తెనాలి రామకృష్ణ’లో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు.

నటీనటులు: సందీప్ కిషన్ ఏం చూసి ఈ సినిమా ఒప్పుకున్నాడో అర్థం కాదు. అతడి శైలికి అసలు సూటయ్యే సినిమా కాదిది. నటన పరంగా ఓకే అనిపించినా.. పాత్ర పరంగా అంత ఫిట్ అనిపించలేదు. ఒక పదేళ్ల కిందట అల్లరి నరేష్ ఈ సినిమా చేస్తే బాగుండేదేమో. హీరోయిన్ హన్సికను అభిమానించేవాళ్లెవ్వరూ ఈ సినిమాకు వెళ్లకపోవడం మంచిది. ఇంతకుముందులా ఆమె బొద్దుగా ఉంటేనే బాగుండేది. బరువు తగ్గే క్రమంలో ఆమె ముఖం పీక్కుపోయినట్లు తయారై ఎబ్బెట్టుగా మారింది. మురళీ శర్మ స్థాయికి తగ్గ పాత్ర చేయలేదిందులో. వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రకు బిల్డప్ మరీ ఎక్కువైంది. వెన్నెల కిషోర్.. ప్రభాస్ శీను.. సప్తగిరి.. ఇలా చాలామందే కమెడియన్లున్నారు సినిమాలో. ఎవరూ పెద్దగా నవ్వించలేకపోయారు.

సాంకేతిక వర్గం: సాయికార్తీక్ కు ఇది సంగీత దర్శకుడిగా 75వ సినిమా అట. మైల్ స్టోన్ మార్కు దగ్గర ఇలాంటి సినిమా పడినందుకు అతను చింతించాల్సిందే. సంగీతంతో ప్రత్యేకత చాటుకునే అవకాశం ఈ సినిమా అతడికి ఇవ్వలేదు. పాటలు ఏమంత ప్రత్యేకంగా లేవు. సినిమాలో పాటలు వస్తే జనాలు బయటికి వెళ్లేలా వాటి ప్లేస్మెంట్ ఉంది. అన్నీ సిగరెట్ సాంగులే. నేపథ్య సంగీతంలోనూ ఏ ప్రత్యేకతా లేదు. సాయిశ్రీరామ్ ఛాయాగ్రహణం కూడా మామూలుగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. రచనలో నలుగురైదుగురి భాగస్వామ్యం ఉంది కానీ.. ఎవరూ కొత్తగా ఏమైనా చేద్దామా అని ప్రయత్నించినట్లు లేదు. కథ పర్వాలేదనిపించినా.. ట్రీట్మెంట్ అసలు కుదరలేదు. స్క్రీన్ ప్లే గురించి.. డైలాగుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దర్శకుడు నాగేశ్వరరెడ్డి ఔట్ డేట్ అయిపోయాడనిపిస్తుంది సినిమా చూస్తే.

చివరగా: తెనాలి రామకృష్ణ.. కేసు వీగిపోయింది

రేటింగ్-1.75/5