Begin typing your search above and press return to search.

తెలుగు ఇండస్ట్రీ లో తొలి కరోనా మరణం.. దిగ్బ్రాంతి లో సినీ తారలు!

By:  Tupaki Desk   |   4 July 2020 8:30 AM GMT
తెలుగు ఇండస్ట్రీ లో తొలి కరోనా మరణం.. దిగ్బ్రాంతి లో సినీ తారలు!
X
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కరోనా కొరడా ఝుళిపిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్షల కేసులతో సతమతమవుతున్న నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో ఈ మహమ్మారి రోజురోజుకి ప్రబలుతోంది. ఇంకా మహమ్మారికి విరుగుడు దొరకని క్రమంలో సామాన్యులతో పాటు టీవీ సీరియల్స్.. సినిమా నటులు.. నిర్మాతలు కరోనా బారిన పడుతున్నారు. దాదాపు మూడు నెలల పాటు ఇంటిపట్టునే ఉన్న సినీనటులు, దర్శకనిర్మాతలు, టెక్నీషియన్లు.. ఇటీవలే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు షూటింగులకు అనుమతి లభించడంతో బయటికి వస్తున్నారు. ప్రభుత్వం కూడా అన్నీ భద్రతా నిబంధనలు అమలు చేసినప్పటికి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికి ఈ మహమ్మారి వదలడం లేదు. ఓ వైపు వైద్యులు కూడా కంట్రోల్ చేయలేని స్థాయిలో కేసులు పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీలో పలువురు కరోనా బారిన పడ్డారు.

షూటింగ్స్ మొదలయ్యాయని ఆనందంలో వెళ్లిన వారికి కరోనా సోకి వారి ఆనందాలను మాయం చేసింది. ఇక తాజాగా ఓ తెలుగు సినీ నిర్మాత పోకూరి రామారావు కరోనాతో మృతి చెందడం షాక్ కి గురిచేస్తున్న విషయం. శుక్రవారం సాయంత్రం ఆయన మృతి చెందటంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నిండింది. ప్రముఖ ఈతరం ఫిలింస్‌ అధినేత పోకూరి బాబురావు సోదరుడే ఈ పోకూరి రామారావు. ఇటీవలే కరోనా పాజిటివ్ అని తెలిసి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నప్పటికీ.. పరిస్థితి విషమించడంతో రామారావు తుదిశ్వాస విడిచారు. ఈ 64యేళ్ళ పెద్దాయన ఈతరం ఫిలింస్‌ బ్యానర్‌ పై తెరకెక్కిన సినిమాలకు సమర్పకుడిగా వ్యహహరించేవారట. రామారావు మరణంతో సినీ సెలెబ్రిటీలు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవలే బిగ్‌బాస్‌-3 కంటెస్టెంట్ రవికృష్ణ, సీరియల్‌ యాక్టర్ నవ్య, ప్రముఖ టీవీ యాక్టర్ ప్రభాకర్, రాజశేఖర్ ఇలా పలువురు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో తొలి కరోనా మరణంతో సినీతారలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.