'మార్చి'ని మార్చేసిన కోవిడ్..!

Wed Mar 03 2021 23:30:31 GMT+0530 (IST)

Telugu Movies Relasing in March 2021

సినీ ఇండస్ట్రీకి మాములుగా 'మార్చి' నెల వస్తుందంటే గుబులు. ఎందుకంటే ఎక్జామ్స్ టైమ్ కాబట్టి సినిమా వాళ్లు ఈ నెలని డల్ సీజన్ గా పరిగణిస్తారు. అందుకే ఆ టైంలో సినిమాలు రిలీజ్ చేయడానికి ఆలోచిస్తుంటారు. అయితే ఈ ఏడాది పరిస్థితులు మారిపోయాయి. కోవిడ్ కారణంగా ఎగ్జామ్స్ మార్చి నుంచి జూన్ నెలకి వాయిదా పడ్డాయి. దీంతో లాక్ డౌన్ కారణంగా గతేడాది రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ.. ఇప్పుడు మార్చిలో రిలీజ్ కి పోటీ పడుతున్నాయి. ఇందులో జనాలకి తెలిసిన సినిమాలు కొన్ని అయితే.. అసలు ఎవరికీ తెలియని సినిమాలు చాలా ఉన్నాయి.మార్చి 5న విడుదల అవుతున్న సినిమాల జాబితా ఓసారి చూస్తే.. సందీప్ కిషన్ 'ఏ1 ఎక్స్ ప్రెస్' - రాజ్ తరుణ్ 'పవర్ ప్లే' - ఆర్కే నాయుడు సాగర్ హీరోగా నటించిన 'షాదీ ముబారక్' సినిమాలు ఉన్నాయి. అలానే యష్ డబ్బింగ్ సినిమా 'గజకేసరి' - విజయ్ సేతుపతి నటించిన తమిళ డబ్బింగ్ సినిమా 'విక్రమార్కుడు' - 'ఏ ఇన్ఫీనిటమ్' - 'పరామమానందయ్య శిష్యుల కథ' 'దేవినేని' 'క్లైమాక్స్' వంటి సినిమాలు కూడా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇంకో రెండు ఊరు పేరు లేని సినిమాలు కూడా విడుదల అవుతున్నాయని తెలుస్తోంది.
 
అలానే మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11న కూడా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. శర్వానంద్ నటించిన 'శ్రీకారం' - నవీన్ పోలిశెట్టి 'జాతిరత్నాలు' - అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన 'గాలి సంపత్' - కన్నడ డబ్బింగ్ సినిమా 'రాబర్ట్' ఒకే రోజు విడుదల అవుతున్నాయి. శివరాత్రి కావడంతో ఇప్పటికే విడుదలై సక్సెస్ అయిన కొన్ని సినిమాలు స్పెషల్ షోల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ తర్వాతి వారం అంటే మార్చి 19న మంచు విష్ణు పాన్ ఇండియా మూవీ 'మోసగాళ్ళు' - ఆది సాయి కుమార్ నటించిన 'శశి' - కార్తికేయ 'చావు కబురు చల్లగా' సినిమాలు విడుదల కానున్నాయి.

ఇదే క్రమంలో మార్చి 26న యూత్ స్టార్ నితిన్ 'రంగ్ దే' - దగ్గుబాటి రానా త్రిభాషా చిత్రం 'అరణ్య' సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఇక కీరవాణి తనయుడు శ్రీ సింహా నటించిన 'తెల్లవారితే గురువారం' చిత్రాన్ని మార్చి 27న రిలీజ్ చేస్తున్నారు. ఇలా మార్చి నెల మొత్తం సినిమా రిలీజులుతో హడావుడిగా ఉండనుంది. ప్రస్తుతం థియేటర్ ఫీడింగ్ అయితే బాగానే జరుగుతోంది. జనాలు ఈ సినిమాల్లో మెజార్టీ భాగం చూసినా టాలీవుడ్ లాభాల బాట పట్టినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. మరి మార్చి నెలలో ఏయే సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతాయో చూడాలి.