Begin typing your search above and press return to search.

రాంగ్ టైమ్ లో పాన్ ఇండియా ప్లాన్స్?

By:  Tupaki Desk   |   31 May 2020 5:30 PM GMT
రాంగ్ టైమ్ లో పాన్ ఇండియా ప్లాన్స్?
X
ఓ వైపు మ‌హ‌మ్మారీ విల‌యం.. మ‌రోవైపు వినోద ప‌రిశ్ర‌మ‌ల్లో ఊహించ‌ని విప‌త్తు.. ఇలాంటి స‌మ‌యంలో పాన్ ఇండియా సినిమాల‌పై అన్ లిమిటెడ్ బ‌డ్జెట్లు వెచ్చించ‌డం స‌రైన‌దేనా? అంటే.. ప్రస్తుత సీన్ చూస్తుంటే క‌రెక్ట్ కాద‌నే వాద‌నే వినిపిస్తోంది.

వాస్త‌వానికి ఈ విప‌త్తు ఎవ‌రూ ఊహించ‌నిది. పైగా బాహుబ‌లి త‌ర్వాత అసాధార‌ణ‌ మానియాతో టాలీవుడ్ లో వ‌రుస‌గా పాన్ ఇండియా ఫైట్ అంత‌కంత‌కు తీవ్ర‌త‌ర‌మైంది. అగ్ర హీరోలంతా పాన్ ఇండియా పిచ్చితో ఊగిపోతున్నారు. కేవ‌లం తెలుగు భాష‌కే ప‌రిమితం కాకుండా ఇత‌ర భాష‌ల్లోనూ త‌మ‌ను తాము నిరూపించుకోవాల‌న్న క‌సి పంతం అంద‌రిలో క‌నిపిస్తోంది. తెలుగు-త‌మిళం-మ‌ల‌యాళం- క‌న్న‌డం- హిందీ ఆడియెన్ కి యాప్ట్ అయ్యే యూనివ‌ర్శ‌ల్ క‌థాంశాల్ని ఎంచుకుని ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాల‌న్న పంతం కూడా పెరిగింది. అందుకు త‌గ్గ‌ట్టే బ‌డ్జెట్లు అమాంతం పెరిగాయి.

ఇప్ప‌టికిప్పుడు టాలీవుడ్ నుంచి డ‌జ‌ను పాన్ ఇండియా సినిమాలు పోటీబ‌రిలో ఉన్నాయంటే అర్థం చేసుకోవ‌చ్చు. ప‌వ‌న్ క‌ల్యాణ్ (క్రిష్ మూవీ)‌- ప్ర‌భాస్ (ఓ డియర్)- ఎన్టీఆర్ (ఆర్.ఆర్.ఆర్)- చ‌ర‌ణ్ (ఆర్.ఆర్.ఆర్) - అల్లు అర్జున్ (పుష్ప‌)- రానా (హాతీ మేరా సాథీ- హిర‌ణ్య‌క‌శిప‌) .. వీళ్లంతా న‌టించేవి పాన్ ఇండియా కేట‌గిరీనే. వీరితో పాటు మెగాస్టార్ చిరంజీవి ఏ ప్లాన్ చేసినా పాన్ ఇండియా అప్పీల్ కోరుకుంటున్నారు. మ‌హేష్ - ప‌ర‌శురామ్ మూవీ రెండు మూడు భాష‌ల్లో విడుద‌ల‌య్యే ఛాన్సుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ (ఫైట‌ర్) - మంచు మ‌నోజ్ (అహం బ్ర‌హ్మ‌స్మి) సైతం పాన్ ఇండియా పిచ్చితో సినిమాల్ని ప్రారంభించ‌డం ఇటీవ‌ల చ‌ర్చ‌కు వ‌చ్చింది. అస‌లు పాన్ ఇండియా ప్ర‌య‌త్నానికి కొత్త కుర్రాళ్లు సీనియ‌ర్ హీరోలు అనే తేడానే లేదు. అంద‌రూ ఓసారి ట్రై చేస్తున్న వైనం క‌నిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే ఫీవ‌ర్ అంత‌కంత‌కు రాజుకుంటోంద‌నే అర్థ‌మ‌వుతోంది.

ఇటు టాలీవుడ్ నిర్మాత‌ల‌కు బాలీవుడ్ నుంచి బిగ్ హ్యాండ్స్ సాయం అవ్వ‌డంతో ప్ర‌య‌త్నాల్లో వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. క‌ర‌ణ్ జోహార్ స‌హా ప‌లు అగ్ర డిస్ట్రిబ్యూట‌ర్లు బాలీవుడ్ నుంచి తెలుగు సినీనిర్మాత‌లతో టై అప్ ల‌కు సై అనేస్తుంటే పాన్ ఇండియా త‌ప్పు కాద‌నే భావ‌న ఏర్ప‌డింది. అయితే ఇది పాన్ ఇండియా సినిమాల‌కు రాంగ్ సీజ‌నా? రైట్ సీజ‌నా? అంటే.. ఊహించ‌ని ఉత్పాతంలా వ‌చ్చి ప‌డిన మ‌హ‌మ్మారీ ప‌ర్య‌వ‌సానాల్ని అంచ‌నా వేస్తే రాంగ్ సీజ‌నేన‌ని అనిపిస్తోంది. ఇది ఇప్ప‌ట్లో అంత‌మ‌య్యే మ‌హ‌మ్మారీ కాక‌పోవ‌డం తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. థియేటర్లు తెర‌వ‌రు.. తెరిచినా జ‌నం రారు! అన్న భ‌యాందోళ‌న నిల‌వ‌నీయ‌డం లేదు. దీని ప‌ర్య‌వ‌సానం బిజినెస్ పైనా ప‌డుతుంది. సినిమాలు తీసేవాళ్ల‌లోనూ ఆందోళ‌న య‌థావిధిగా కంటిన్యూ అవుతుంది. అందుకే 2020 వినోద ప‌రిశ్ర‌మ‌ల పాలిట శాపంగా రికార్డులకెక్కుతోంది.