కోలీవుడ్ లో సైలెంటుగా జెండా పాతిన తెలుగమ్మాయ్!

Mon Feb 22 2021 18:05:03 GMT+0530 (IST)

Telugu Girl In Kollywood

తెలుగు వారిని తమిళ తంబీలు ఎంతగా గేలి చేస్తారో తెలిసిన వ్యవహారమే. తెలుగు ఇండస్ట్రీ అంటే కమర్షియల్ సినిమాలు తప్ప నేచురాలిటీ రియాలిటీ ఉండదని ఒకప్పుడు విమర్శించారు. కానీ ఆ ధృక్పథం ఇటీవల మారుతోంది. మనవాళ్లు ప్రయోగాలతో అదరగొడుతున్నారు. మన సినిమాల్నే తంబీలు రీమేక్ లు చేస్తున్నారు.ఇక తెలుగు వాడే అయిన విశాల్ కోలీవుడ్ ని ఏల్తున్నాడు. అక్కడ నిర్మాతల మండలి.. ఫిలింఛాంబర్ అన్నిటా ప్రభావం చూపుతున్నాడు. అతడిపై ఒకరకంగా తంబీ నిర్మాతలు కక్ష కట్టినా ఏమీ చేయలేనంత ఎత్తుకు ఎదిగాడు.

అదంతా సరే కానీ.. టాలీవుడ్ నుంచి తెలుగమ్మాయిలు తమిళ పరిశ్రమలో అడుగు పెట్టి అక్కడ జెండా పాతేయడం ప్రతిసారీ చర్చనీయాంశమే. ఇంతకుముందు కలర్స్ స్వాతి.. బిందుమాధవి లాంటి నాయికలు అక్కడ సత్తా చాటారు. పర్మినెంట్ గా సినిమాలు చేస్తూ అలరించారు.

మరో తెలుగమ్మాయి రక్షిత అక్కడ ఆనందిగా పేరు మార్చుకుని కథానాయికగా పాపులరైంది. ఇప్పటికే పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. తాజాగా ఈ భామ నటించిన నాయికా ప్రధాన చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ బాక్సాఫీస్ వద్ద ఇదే టాప్ మూవీ అన్న టాక్ వినిపిస్తోంది. అందునా ఆనంది నటన అదరగొట్టిందన్న ప్రశంస దక్కింది. ఆనంది కెరీర్ కి ఇదొక్కటి చాలు! అంటూ తంబీ క్రిటిక్ పొగిడేయడం ఆసక్తిని కలిగిస్తోంది.

ఇంతకీ ఏదా సినిమా అంటే..! `కమలి ఫ్రమ్ నడుక్కవేరి` అనేది టైటిల్. రాజశేఖర్ దురైస్వామి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించారు. ఈ శుక్రవారం రిలీజైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా ఆనంది పెర్ఫామెన్స్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.

అంతగా ఆ సినిమలో ఏం ఉంది? అంటే.. ఒక విలేజీ అమ్మాయి ఎన్నో కష్టాలకు వోర్చి ఐఐటీ లో చదవాలన్న కలను నెరవేర్చుకుంటుంది. ఎంతో సరళమైన కథను అంతే హృద్యంగా తెరపై ఆవిష్కరించారు దర్శకుడు. ఇలాంటివి ప్రేరణనిస్తాయి. యూత్ లో స్ఫూర్తిని నింపుతాయి. అందుకే ఇది బాగా కనెక్టయిపోయింది. ఆనందికి అసాధారణ ఫాలోయింగ్ పెరిగింది ఈ చిత్రంతో. మూవీ కలెక్షన్లు అదిరిపోతున్నాయట. ఇక కోలీవుడ్ లో ఈ అమ్మడి హవాకు ఎదురుండదు అని చెబుతున్నారు.

ఆనంది ఇంతకుముందు బస్ స్టాప్ - ఈరోజుల్లో చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఆ రెండూ బ్లాక్ బస్టర్లే అయినా తెలుగులో ఆశించినంతగా కెరీర్ వెలగలేదు. రచ్చ గెలిచి ఇప్పుడు మళ్లీ తెలుగు పరిశ్రమకు తిరిగి వస్తుందేమో  చూడాలి.