Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీని కాపాడాలో.. ముంచాలో తేల్చిది మన స్టార్లే

By:  Tupaki Desk   |   26 May 2020 12:30 PM GMT
ఇండస్ట్రీని కాపాడాలో.. ముంచాలో తేల్చిది మన స్టార్లే
X
మహమ్మారి విజృంభించింది. జనాలందరినీ ఇంటికే పరిమితం చేసింది. దేశాలకు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. అన్నింటికంటే దెబ్బ సామూహికంగా జరిగే సినిమాలు, షూటింగ్ లు.. మొత్తం సినీ ఇండస్ట్రీని మహమ్మారి లాక్ డౌన్ చావు దెబ్బతీసింది. వడ్డీలకు కోట్లు తెచ్చి సినిమాలు తీస్తున్న నిర్మాతలను చావు దెబ్బతీసింది. వ్యాపారమే లేకుండా చేసింది. వైరస్ భయానికి థియేటర్లు ఓపెన్ కావడం కనుచూపు మేరలో కనిపించడం లేదు. సినిమా ఇండస్ట్రీ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. సినిమా షూటింగ్ లు ప్రారంభమై విడుదల చేయాలని చూసినా జనాలు వైరస్ భయానికి థియేటర్స్ కు వస్తారా? చూస్తారా అన్న గ్యారెంటీ లేదు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీ బతికి బట్టకట్టడంపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మరి ఈ సినిమా ఇండస్ట్రీపై ఎదిగిన మన స్టార్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు పారితోషకాలు తగ్గించుకుంటారా? లేక అలానే రేటు కంటిన్యూ చేసి సినిమా ఇండస్ట్రీని చావు దెబ్బతీస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కోలివుడ్ సినిమా ఇండస్ట్రీని బతికించేందుకు.. తిరిగి పూర్వపు స్థితికి తీసుకొచ్చేందుకు తాజాగా నిర్మాతలు నడుం బిగించారు. అక్కడి హీరోలు, నటులు చేయూతనందించారు. ప్రఖ్యాత విలక్షణ హీరో విజయ్ సేతుపతి, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు సత్యరాజ్, పార్థీపాన్ లు కీలక పాత్రలుగా విరాళాలతో ఒక సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో నటించే ఏ నటుడికి ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ ఇవ్వరు. సాంకేతిక నిపుణులు కూడా ఉచితంగా పనిచేయాలి. సినిమా ఆడి లాభాలు వచ్చాక అందరికీ పంచుతారు.

ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని కేవలం 30 రోజుల్లోనే తీయాలని సంకల్పించారు. సినిమా హాళ్ల ప్రారంభం తరువాత ఈ సినిమానే మొదట విడుదల చేయనున్నారు. ఆ తరువాత 100 రోజులకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కు, టీవీల్లో కూడా ప్రదర్శించనున్నారు. ఇలా కోలివుడ్ సినీ పరిశ్రమకు తిరిగి ఊపిరి లూదేందుకు ఇండస్ట్రీ అంతా విరాళాలు పోగు చేసి సినిమా తీస్తున్న తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ సైతం ఇలా ఎవరికి నష్టం కలగని రీతిలో సినిమాలు తీస్తే పరిశ్రమ బాగుపడుతుంది. తిరిగి పూర్వ రూపం సంతరించుకుంటుందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. అయితే మన హీరోలు మాత్రం ఇప్పటిదాకా తమ పారితోషకాలు తగ్గించుకునే విషయంలో ఎవ్వరూ నోరుమెదపలేదు. కనీసం షూటింగ్ లు మొదలు పెట్టేందుకు చిరంజీవి, నాగార్జునలతో కలిసి ప్రభుత్వంతో సంప్రదించిన బృందంలో కూడా లేరు.

సినిమా థియేటర్లు రిలీజ్ అయ్యే అవకాశాలు లేకపోవడంతో కోట్లు ఖర్చు పెట్టి తీసిన అనుష్క ప్రధాన పాత్రలోని ‘నిశ్చబ్దం’.. కీర్తి సురేష్ నటించిన ‘మిస్ ఇండియా’ సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారట..ఇక హీరో నాని భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’కి బ్రేక్ వేసి సాధారణ బడ్జెట్ చిత్రానికి ఓకే చెప్పాడట.. ఇక ప్రస్తుతం షూటింగ్ మొదలైనా వైరస్ జాగ్రత్తలు, వసతులు, శానిటైజేషన్ లాంటి జాగ్రత్తలతో నిర్మాతకు అదనంగా భారీ ఖర్చు అవుతుంది. పారితోషికాలు తగ్గించకపోతే నిర్మాతల పుట్టి మునగడం ఖాయంగా కనిపిస్తోంది. దుబారా ఖర్చులు కూడా తగ్గించుకోవాల్సి వస్తుంది.

ఇక థియేటర్స్ ఓపెన్ చేసి అందరినీ కూర్చుండబెట్టరు. ఒక సీటు వదిలి మరో సీట్లో కూర్చోవాలి. అంటే 300 సామర్థ్యం ఉన్న థియేటర్లో 150మందే చూడొచ్చు. దీన్ని బట్టి ఆదాయం సగం అవుతుంది. సినిమాలను భారీ రేట్లకు ఎవరూ కొనరు. వ్యాపారం తగ్గుతుంటే నిర్మాతలు.. స్టార్ల రెమ్యూనరేషన్లు సహా అన్ని ఖర్చులూ తగ్గించుకోక తప్పని పరిస్థితి ఏర్పడనుంది.

హాలీవుడ్ లో ఒక సినిమా ఖర్చులో నటులకు ఇచ్చేది కేవలం 20శాతమేనట.. కానీ మన దగ్గర పెద్ద హీరోలు, దర్శకుల పారితోషకాలకే ఏకంగా 60శాతం బడ్జెట్ పోతుంది. చిన్న సినిమాల్లోనూ 50శాతం రెమ్యూనరేషన్లకే పోతుంది. పైగా హిట్ అయితే లాభాల్లో వాటా కూడా.. స్టార్ హీరోలతో సినిమాలంటే సగానికి పైగానే అతడికే పారితోషకం ఇవ్వాలి. ఇప్పుడు సినిమాలు ఆడని పరిస్థితులు ఉన్నాయి. సినిమా రంగం ఏటువైపు వెళుతుందో తెలియని పరిస్థితి. దీంతో నిర్మాణవ్యయం ఎలాగూ తగ్గదు. కాబట్టి టాప్ స్టార్లు, దర్శకులు, టెక్నీషియన్లు తమ రెమ్యూనరేషన్లు తగ్గించుకోవడం తప్ప మరో మార్గం లేదు.

ఇప్పటికే తమిళనాట సినీ ప్రముఖులు నాజర్, విజయ్ అంటోనీ, దర్శకుడు హరిలు 25శాతం పారితోషకం తగ్గించుకుంటున్నట్టు తెలిపారు. ఈ కరోనా కష్టకాలంలో తెలుగు స్టార్లూ ఈ దోవలో నడవాల్సి ఉంటుంది. సినిమా విడుదలయ్యాక రాబడిని బట్టి పారితోషకం తీసుకుంటేనే సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది. పారితోషకాలు కనుక మన స్టార్లు తగ్గించుకోకుంటే ఈ సినిమా ఇండస్ట్రీ అంపశయ్యపైకి వెళుతుంది. ఇండస్ట్రీని కాపాడాలో.. ముంచాలో తేల్చిది ఇప్పుడు మన స్టార్లు, వారి పారితోషకాలే అనడంలో ఎలాంటి సందేహం లేదని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.