Begin typing your search above and press return to search.

సీఎం జగన్ మోహన్ రెడ్డికి తెలుగు చలనచిత్ర మండలి లేఖ..!

By:  Tupaki Desk   |   27 May 2020 2:49 PM GMT
సీఎం జగన్ మోహన్ రెడ్డికి తెలుగు చలనచిత్ర మండలి లేఖ..!
X
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా చిత్ర పరిశ్రమ తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు అయ్యాయి. చిత్ర పరిశ్రమ కూడా రెండుగా చీలిపోనుందా.. ఏపీకి తరలిపోనుందా అనే అనుమానాలు చాలానే వ్యక్తమయ్యాయి. అయితే సినీ ఇండస్ట్రీ మాత్రం రెండు రాష్ట్రాల్లో షూటింగులను జరువుకుంటూ వస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో స్టూడియోలు ల్యాబ్ లు ఇళ్ల స్థలాలు పొందిన టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇప్పుడు ఏపీలో కూడా తమ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చేయూతనివ్వాలని నిర్మాతల తెలుగు చలనచిత్ర మండలి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కోరింది.

చిత్ర పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు - స్టూడియోలు - ల్యాబ్స్ - అలాగే నిర్మాతలకు - ఆర్టిస్టులకు - ఇతర పరిశ్రమ వర్గాలకు హౌసింగ్ కొరకు అవసరమైన స్ధలాలను కేటాయించాలని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోరింది. ఈ మేరకు మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ - కార్యదర్శులు టి. ప్రసన్నకుమార్ - వడ్లపట్ల మోహన్ ముఖ్యమంత్రికి సీఎంకు లేఖ రాశారు. అంతేకాకుండా జీవో నెం.45 ద్వారా ఆంధ్రప్రదేశ్‌ లో షూటింగులు చేసుకోవడానికి ప్రభుత్వానికి చెందిన ప్రాంగణాలను ఉచితంగా అందిస్తున్నట్లు ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రికి వారు కృతఙ్ఞతలు తెలియచేశారు.

ఈ నేపథ్యంలో చెన్నై నుంచి సినీ ఇండస్ట్రీ హైదరాబాద్‌ కు తరలి వచ్చిన సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి స్టూడియోలు నిర్మించుకోవడానికి - ల్యాబ్స్ కట్టుకోవడానికి స్ధలాలు ఉదారంగా కేటాయించారని.. అలాగే నిర్మాతలు - ఆర్టిస్టుల హౌసింగ్ కొరకు కూడా స్ధలాలు ఇచ్చారని వారు గుర్తు చేశారు. అదే విధంగా నేడు ఆంధ్రప్రదేశ్‌ లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి పరిశ్రమ వర్గాలకు అవసరమైన స్ధలాలను కేటాయించాలని వారు ఈ లేఖలో కోరారు. ఈ క్రమంలో ఏపీ టెలివిజన్ మరియు చిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్ధ మేనేజింగ్ డైరెక్టర్ టి. విజయకుమార్ రెడ్డికి - ఛైర్మన్ విజయ్ చందర్‌ కు కూడా ఇదే లేఖను అందించారు.

ఇదిలా ఉండగా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సినిమా షూటింగులకు అనుమతిస్తూ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమకు మేలు కలిగించే నిర్ణయాలతో పాటు సింగిల్ విండో అనుమతుల జీవో విడుదల చేసినందకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ తరుపున ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఫోన్‌ లో మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికిప్పుడు ఏపీ ప్రభుత్వం షూటింగ్స్ విషయంలో ఎన్నో వెసులు బాటులు ఇచ్చినా.. ఉన్న పలంగా చిత్ర పరిశ్రమ హైదరాబాద్ నుంచి అంత ఈజీగా వేరే చోటుకి తరలిపోయే అవకాశలైతే లేదు. కాకపోతే రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ ఇండస్ట్రీ కార్యకలాపాలు జరిగే అవకాశం ఉందని అర్థమవుతోంది.