మహేష్- విజయ్ కోసమే పాగా వేశారు కానీ..!

Sun May 16 2021 18:00:13 GMT+0530 (IST)

Telugu Director duo Raj DK narrated an idea to Super Star Mahesh Babu

`ఫ్యామిలీ మ్యాన్` వెబ్ సిరీస్ తో తెలుగు కుర్రాళ్లు రాజ్ అండ్ డీకే సత్తా ఏంటో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరోమారు ప్రూవైంది. నిజానికి రాజ్ అండ్ డీకే (రాజ్ నిడిమోరు-కృష్ణ డీకే)కి ఇంతకుముందే బాలీవుడ్ లో గొప్ప పేరుంది. ఫ్లేవర్స్- 99- షోర్ ఇన్ ద సిటీ- గో గోవా గాన్- హ్యాపీ ఎండింగ్ లాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలతో సత్తా చాటిన దర్శకులు ఆ ఇద్దరూ. స్త్రీ అనే బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించారు. చిత్తూరు నుంచి వెళ్లి బాలీవుడ్ లో పాగా వేసిన ఆ ఇద్దరూ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో మరింతగా పాపులారిటీ పెంచుకున్నారు.ఇక రాజ్ అండ్ డీకే ఇంతకుముందు సందీప్ కిషన్ హీరోగా డీ ఫర్ దోపిడీ అనే చిత్రాన్ని తెరకెక్కించినా ఇక్కడ విజయం సాధించలేదు. నాని ఆ చిత్రానికి ఒక నిర్మాతగా కొనసాగారు. ఇక ఇటీవలి కాలంలో రాజ్ అండ్ డీకే మహేష్ .. విజయ్ దేవరకొండ లాంటి స్టార్లతో సినిమాలు చేయాలనుకున్నా అది వెంటనే కుదరడం లేదట. ఆ విషయాన్ని ఈ జోడీ తాజా చిట్ చాట్ లో చెప్పారు.

ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో రిలీజై విశేష ఆదరణ దక్కించుకుంటున్న సినిమా బండి చిత్రాన్ని నిర్మించిన ఆ ఇద్దరి పేర్లు మారోసారి జాతీయ స్థాయిలో మార్మోగుతున్నాయి.  చక్కని కాన్సెప్ట్ ఉన్న ఈ సినిమాని అభిరుచి ఉన్న నిర్మాతలుగా వారు ప్రెజెంట్ చేసిన తీరును మెచ్చుకుంటున్నారు. ఈ చిత్రంతో ప్రవీణ్.కె దర్శకుడిగా పరిచయం అయ్యారు.

ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. అయితే తెలుగు కుర్రాళ్లు పైగా ప్రతిభావంతులే అయిన రాజ్ అండ్ డీకేతో సినిమాలు చేయకపోవడం ఆశ్చర్యం కలిగించేదే. మహేష్ కానీ దేవరకొండ కానీ ఈసారి రాజ్ అండ్ డీకేతో సినిమాలు చేస్తారనే భావిద్దాం. కొన్నిటికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.