ఏ సినిమా రెండున్నర గంటలు తగ్గట్లేదుగా

Fri Sep 20 2019 11:04:35 GMT+0530 (IST)

Telugu Cinems Run Time

నిజమే.. సినిమాతో వచ్చే సంతోషం లెక్కే వేరంటారు సినీ అభిమానులు. తెలుగు ప్రజలకు సినిమాలకు ఉండే అనుబంధం కాస్త ఎక్కువే. వారి జీవితంలో భాగమయ్యే సినిమాలు వారి లైఫ్ ను ఎంత ప్రభావితం చేస్తాయన్న విషయం ఈ మధ్యనే మహేశ్ బాబు బ్రాండ్ లోగో లాంఛ్ సందర్భంగా చూశాం. తన భర్తకు మహేశ్ అంటే ప్రాణమని.. తన పేరు నమత్ర పేరు కావటంతో తనను పెళ్లాడారని.. మహేశ్ తమ జీవితం మీద ఎంత ప్రభావం చూపుతాడో ఆమె చెబుతుంటే.. అందరూ అవాక్కు అయిపోయారు.బయటకొచ్చిన ఇలాంటివి కొన్నే.. బయటకు రానివి చాలానే ఉంటాయి. ఇప్పటి డిజిటల్ యుగంలో జీవితం వేగవంతమైంది. గతంలో మాదిరి నెమ్మదిగా కదలటం లేదు. ఎవరికి వారు బిజీ.. బిజీ అనేస్తున్నారు. అంత బిజీగా మార్చిన జీవితంలో మారనిది ఏమైనా ఉందంటే.. సినిమా అలవాటే. జీవితంలో ఎన్ని వచ్చినా.. కాసేపు సరదాగా.. చిల్ కావటానికి.. మనసును సేద తీర్చుకోవటానికి.. ఒత్తిళ్లు.. టెన్షన్ల నుంచి రిలీఫ్ కు చాలామంది సినిమా అనే వినోదాన్ని ఇష్టపడుతుంటారు.

అయితే.. ఇటీవల వస్తున్న తెలుగు సినిమాల నిడివి అంతకంతకూ పెరిగిపోతోంది. కొంతకాలం క్రితం వరకూ రెండుపావు గంటల వరకే పరిమితమైన సినిమాలు రెండున్నర గంటలకు చేరుకోవటమేకాదు.. ఇప్పుడు ఏకంగా మూడు గంటలకు దగ్గరైపోతున్నాయి. దీంతో.. సినిమా అంటే చాలు తక్కువలో తక్కువ నాలుగు గంటల వరకూ సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది.

నగరాల్లో అయితే.. మూడు గంటల సినిమాకు రానుపోను.. మధ్యలో బ్రేక్.. ట్రైలర్స్ వెరసి.. నాలుగున్నర గంటలకు పైనే పడుతుందంటున్నారు. అదే.. చిన్న మధ్యతరహా ఊళ్లల్లో అయితే నాలుగు గంటలు పడుతోందంటున్నారు. సినిమాను వీలైనంత క్రిస్ప్ గా చెప్పాల్సి ఉన్నా.. తాము చెప్పాల్సిందంతా చెప్పటానికి ఈ మధ్యన తెలుగు దర్శకులు మూడు గంటలు తప్పదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఇవాల్టికి ఇవాళ విడుదలవుతున్న రెండు పెద్ద తెలుగు సినిమాల విషయానికి వస్తే.. వరుణ్ తేజ్ నటించిన గడ్డల కొండ గణేశ్ అలియాస్ వాల్మీకి సినిమా నిడివి ఏకంగా 2-54 గంటలుకాగా.. సూర్య.. మోహన్ లాల్.. ఆర్య లాంటి అగ్రనటులు నటించిన డబ్బింగ్ బందోబస్త్ కూడా 2-46 గంటలు కావటం గమనార్హం. ఈ రెండు సినిమాలే కాదు.. ఇటీవల విడుదలైన చాలా సినిమాలు రెండున్నర గంటల పైనే ఉండటం గమనార్హం. అదే సమయంలో హిందీ సినిమాలు మాత్రం రెండున్నర గంటలకు తక్కువగా ఉండటం విశేషం. బాలీవుడ్ చిత్రాలు 2-10 నుంచి 2-20 గంటల మధ్యలోనే ముగించేస్తున్నారు.

ఇవాళ విడుదలైన ద జోయా ఫ్యాక్టర్ సినిమా 2-16గంటలు మాత్రమే. మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్.. సోనమ్ కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం నిడివి ఇవాళ రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాలతో పోలిస్తే దాదాపు అరగంట తక్కువ కావటం గమనార్హం. మరోవైపు తెలుగులో ప్రయోగాత్మకంగా తీస్తున్న పలు సినిమాలు రెండు గంటలు.. అంతకు మరో ఐదు.. పది నిమిషాల నిడివితో పూర్తి చేస్తున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంఫుల్ గా ఎవరును చెప్పొచ్చు. ఈ సినిమా నిడివి కేవలం 1-58 గంటలు మాత్రమే.

ఇటీవల విడుదలైన కొన్ని తెలుగు సినిమాల నిడివి చూస్తే..

గడ్డలకొండ గణేష్ (వాల్మీకి)  2-54 గంటలు
బందోబస్త్       2.46 గంటలు
సాహో 2- 30 గంటలు
గ్యాంగ్ లీడర్ 2- 35 గంటలు
కౌసల్య కృష్ణమూర్తి నిడివి 2-29 గంటలు
మన్మధుడు-2    2- 35 గంటలు
డియర్ కామ్రేడ్  2- 50 గంటలు

TAGS: