ట్రెండీ టాక్: ఎక్కడివాళ్లు అక్కడే గప్ చుప్!

Sun Jul 05 2020 12:00:02 GMT+0530 (IST)

Television Actors Teach A Big Less To The Industry!

కొరివితో తల గోక్కోవడం ఎవరికైనా సరదానా?  ఇప్పుడున్న సన్నివేశంలో సెట్స్ కి వెళ్లడం అన్నదే అలాంటి దుస్సాహసం. టీవీ స్టార్లు ప్రభాకర్.. నవ్యస్వామి.. రవి కృష్ణ (బిగ్ బాస్ 3 ఫేం.. ఆర్టిస్ట్).. అక్క మొగుడు ఫేం సాక్షి శివ... శిల్పా రెడ్డి (ఫ్యాషనిస్టా).. వీళ్లంతా కరోనా వ్యాధికి చికిత్స పొందుతున్నారన్న వార్త పరిశ్రమలో కలకలం రేపింది.20-30 లోపు పరిమిత సిబ్బందితో ప్రభుత్వ మార్గదర్శకాల్ని అనుసరిస్తూ టీవీ సీరియళ్ల షూటింగులు చేస్తేనే ఇంతమందికి అంటుకుంది మహమ్మారీ. దీంతో సెట్స్ కి వచ్చిన సిబ్బందిని వెంటనే క్వారంటైన్ కి పంపాల్సొచ్చింది. ఒకవేళ 50 మందితో సినిమాల షూటింగులు చేస్తే సన్నివేశం ఎలా ఉంటుందో?  అసలే గ్రేటర్ హైదరాబాద్ సహా అన్ని నగరాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. కమ్యూనిటీ స్ప్రెడ్ కి తెర లేచింది. దీనికి తోడు వర్షాకాలం కూల్ వెదర్ తోనూ ప్రమాదం ముంచుకు రానుంది. జ్వరం.. దగ్గు వస్తే అవి రెగ్యులర్ గా వచ్చేవేనా.. కాదా? అన్నది గ్రహించలేని పరిస్థితి ఉంది.

ఆ క్రమంలోనే ఇప్పటికే షూటింగులుకు సిద్ధమవుతున్న పెద్ద తెర స్టార్లు నెమ్మదిగా ఆలోచనను మార్చుకుంటున్నారట. నిర్మాతలకు ఫోన్ చేసి ఇప్పట్లో రాలేమని వ్యాక్సిన్ వచ్చాక లేదా మహమ్మారీ తగ్గుముఖం పట్టాక ఆలోచిద్దామని చెప్పేస్తున్నారట. కేవలం 20-30 శాతం పెండింగ్ షూట్లు ఉన్న వారు మాత్రమే రిస్క్ చేస్తున్నారు. మిగతా భారీ షెడ్యూల్స్ ఉన్న వాళ్లు.. కొత్తగా షూటింగ్ ప్రారంభించాలనుకున్న వాళ్లు తాజా సన్నివేశంతో ఇంకా వేచి చూస్తున్నారు. దీంతో ఇప్పట్లో సినిమాల షూటింగులు చేయడం కష్టంగానే కనిపిస్తోంది. ఏప్రిల్- మే- జూన్ - జూలై గంగలో కలిసాయి. ఆగస్టు- సెప్టెంబర్ ఇంతకంటే గొప్పగా ఏం ఉండవు అన్నది ఓ అంచనా. ఆ క్రమంలోనే బుల్లితెర షూటింగులు సహా ఓటీటీ షూటింగులు కూడా వాయిదా పడే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితి చూస్తుంటే దసరా వరకూ ఇలానే ఉండేట్టుంది!