ఇప్పుడు కేసు పెట్టాల్సింది ఎవరి మీదా? తేజ్ రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం

Sat Sep 11 2021 10:00:01 GMT+0530 (IST)

Tej road accident that sparked a new debate

సంచలనంగా మారిన టాలీవుడ్ హీరో కమ్ మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి సంబంధించి కొత్త విషయం బయటకు వచ్చింది. శుక్రవారం రాత్రి 9 గంటల వేళలో.. మాదాపూర్ లోని ఐకియా రోడ్డు మీద జరిగిన రోడ్డు ప్రమాదం అతి వేగమన్న మాట వినిపించింది. అయితే.. అందులో నిజం పాక్షికమేనని చెబుతున్నారు. తలకు హెల్మెట్ పెట్టుకొని.. కాన్ఫిడెంట్ గా వెళుతున్న బైక్.. రోడ్డు మీద స్కిడ్ అయిన వైనం స్పష్టంగా కనిపించింది. అంతేకాదు.. తేజ్ డ్రైవింగ్ ఏమీ ప్రమాదకరంగా లేదన్న విషయం సీసీ ఫుటేజ్ చూసిన వారికి ఇట్టే అర్థమవుతుంది.



దాదాపు రూ.18లక్షలు విలువ చేసే ఈ ఖరీదైన బైకు ఎందుకు స్కిడ్ అయ్యింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం తాజాగా దొరికింది. మాదాపూర్ రోడ్డులో ఎక్కడా లేని రీతిలో.. తేజ్ యాక్సిడెంట్ జరిగిన రోడ్డు మీద ఇసుక ఉండటంతో బైక్ స్కిడ్ అయినట్లుగా భావిస్తున్నారు. దీనికి తోడు వేగంగా వెళ్లే వాహనాలు ఇసుక మేట లో స్కిడ్ కావటం జరుగుతుందని చెబుతన్నారు. వేగంగా వెళ్లే ట్రయంఫ్.. డ్యూక్.. బీఎండబ్ల్యూ బైకులు ఇసుకలో ఎక్కువగా స్కిడ్ అవుతుంటాయన్న మాట తరచూ వినిపిస్తుంటుంది.

తేజ్ రోడ్డు ప్రమాదం జరిగిన చోట ఇసుక మేట ఉండటం.. రోడ్డు పక్కనే నిర్మాణ పనులు జరుగుతుండటం కూడా.. ఇసుక మేటకు కారణమన్నట్లుగా చెబుతున్నారు. ఈ ఉదయం ప్రమాదానికి కారణమైన ప్రాంతంలోని ఇసుకను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. బాధాకరమైన విషయం ఏమంటే.. తేజ్ కు ప్రమాదం జరిగిన చోటు తప్పించి.. కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వరకు రోడ్డు మీద ఎక్కడా ఇసుక లేకపోవటం. ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే ఇసుక ఉంది.
వేగంగా వెళుతున్న బైక్ మీద నుంచి పడిన తేజ్ మీద రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా రోడ్డు మీద ఇసుక ఉన్న కారణంగా బండి స్కిడ్ అయిన విషయం వెలుగు చూడటంతో కొత్త వాదన తెర మీదకు వచ్చింది. రోడ్డు మీద ఇసుక ఉన్నప్పుడు దాన్ని ఎప్పటికప్పుడు తొలగించాల్సిన జీహెచ్ఎంసీ ఎందుకు ఆ పని చేయలేదు? దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? అని ప్రశ్నిస్తున్నారు.

రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే రెండు సెక్షన్లతో తేజ్ మీద కేసు పెట్టిన రాయదుర్గం పోలీసులు.. ఇసుక ఎపిసోడ్ నేపథ్యంలో.. కేసు నమోదు చేయాల్సింది బాధితుడి మీదనా? అంటూ పలువురు  సోషల్ మీడియాలో ప్రశ్నల్ని సంధిస్తున్నారు. ఒకవేళ.. రోడ్డు మీద ఇసుక లేనిపక్షంలో బైక్ స్కిడ్ అయ్యే అవకాశం ఉండేది కాదు. అదే పరిస్థితి ఉంటే.. ప్రమాదానికి అవకాశమే ఉండేది కాదు. అలాంటప్పుడు ప్రమాదానికి కారణమైన వారి మీద చర్యల మాటేమిటి? అన్న ప్రశ్న ఇప్పుడు తెర మీదకు వచ్చింది.