తారక్ - చరణ్ ల ఫోటో వైరల్.. 'RRR' లో ఈ సీన్ ఏ రేంజ్ లో ఉంటుందో..!

Wed Jul 21 2021 13:12:58 GMT+0530 (IST)

Tarak - Charan's photo goes viral

'బాహుబలి' వంటి విజువల్ వండర్ ని అందించిన దర్శక ధీరుడు రాజమౌళి.. కాస్త గ్యాప్ తీసుకొని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ''ఆర్ ఆర్ ఆర్''. నందమూరి మెగా ఫ్యామిలీలకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ RRR విడుదల కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు మేకర్స్ వెల్లడించడంతో మరికొన్ని రోజుల్లో ట్రిపుల్ ఆర్ ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంచనాకు వచ్చేసారు. 2021 అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామంటూ రాజమౌళి సైతం సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు. మాస్టర్ స్టోరీ టెల్లర్ తన సినిమాని పబ్లిసిటీ చేయడంలో మాస్టర్ మైండ్ ఉపయోగించారు. 'రోర్ ఆఫ్ ఆర్ ఆర్ ఆర్' పేరుతో మేకింగ్ వీడియో రిలీజ్ చేసి సినిమాపై బజ్ క్రియేట్ చేసారు.'RRR గర్జన' వీడియోలో నటీనటులు సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో తెలియజేసారు. ఈ గ్లిమ్స్ ని స్లో మోషన్ లో చూసిన ఆడియన్స్.. ఒక్కో ఒక్కో ఫ్రేమ్ ని చూసి.. జక్కన్న ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడినట్లే అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ లకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో పోలీస్ గెటప్ లో చరణ్ కనిపిస్తుండగా.. పక్కనే ఎన్టీఆర్ ను కట్టేసి ఉన్నారు. దీంతో బందిపోటు అయిన తారక్ ని చరణ్ బంధిస్తాడని కొందరు నెటిజన్స్ అంటుంటే.. కాదు బంధింపబడిన ఎన్టీఆర్ ను చెర్రీ వచ్చి విడిపిస్తారని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా మెగా - నందమూరి హీరోలను ఒకే స్క్రీన్ పై చూడాలని ఆశ పడిన అభిమానులు ఈ ఫోటోను నెట్టింట షేర్ చేస్తూ వైరల్ చేసేస్తున్నారు.

కాగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కుమురం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. చరిత్రలో కలవని ఇద్దరు విప్లవ వీరులు కలిసి పోరాటం చేస్తే ఎలా ఉంటుందనే కల్పిత కథతో ఈ ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామా తెరకెక్కుతోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దీనికి స్టోరీ అందించారు. కీరవాణి సంగీతం సమకూర్చగా.. బుర్రా సాయి మాధవ్ మాటలు రాస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిష్ కనిపించనుంది. ఇందులో అజయ్ దేవగన్ - సముద్రఖని - శ్రియా లతో పాటుగా పలువురు హాలీవుడ్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జక్కన్న ఒకవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చూసుకుంటున్నారు. RRR యూనిట్ తో ఓ ప్రమోషనల్ సాంగ్ ప్లాన్ చేసిన రాజమౌళి.. ఇప్పటికే తారక్ - చరణ్ లతో వివిధ భాషల్లో డబ్బింగ్ పూర్తి చేశారు. ఆగస్టు చివరి నాటికి చిత్రీకరణ మొత్తం పూర్తి చేసి పోస్ట్ పొడక్షన్ వర్క్ మరియు ప్రమోషన్స్ పై దృష్టి పెట్టనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో 'RRR' మూవీ విడుదల కానుంది.