Begin typing your search above and press return to search.

తాండ‌వ్ వివాదం: వారి నాలుక కోస్తే కోటి బ‌హుమ‌తి

By:  Tupaki Desk   |   24 Jan 2021 7:20 AM GMT
తాండ‌వ్ వివాదం: వారి నాలుక కోస్తే కోటి బ‌హుమ‌తి
X
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న వెబ్ సిరీస్ ‘తాండవ్’పై వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ మూవీలో హిందూ దేవుళ్లు, దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశార‌ని, త‌మ‌ మనోభావాలు దెబ్బ‌తిన్నాయ‌ని ప‌లువురు బీజేపీ నేత‌లు ఆరోపించిన విష‌యం తెలిసిందే. దీంతో.. ‘తాండవ్’ యూనిట్ క్షమాపణలు చెప్పింది. అభ్యంత‌రం తెలిపిన సీన్లను తొలగించనున్నట్టు కూడా ప్రకటించింది.

దీంతో వివాదం స‌ద్దుమ‌ణిగింద‌ని భావించిన‌ప్ప‌టికీ.. తాజాగా మహారాష్ట్ర కర్నిసేన స్పందించింది. ‘తాండవ్’ వెబ్‌ సిరీస్ లో హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి నాలుక కత్తిరించి తెచ్చిన వారికి కోటి రూపాయలు ఇస్తామ‌ని కర్ణిసేన చీఫ్ అజయ్ సెంగార్ అన్నారు. ‘తాండవ్’ దర్శక, నిర్మాతలు ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెప్పినప్పటికీ అది సరిపోదన్నారు. ఆ క్షమాపణలను తాము అంగీకరించబోమని చెప్పుకొచ్చారు.

హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ కంటెంట్ ఇండియా హెడ్ అలీ అబ్బాస్ జాఫర్, వెబ్ సిరీస్ నిర్మాత హిమాంశు కృష్ణ మెహ్రా, రచయిత సోలంకి, ఇతరులపై లక్నోలోని హజ్రత్‌గంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైందైన విష‌యం తెలిసిందే. తాజాగా.. ముంబైలోని ఘట్కోపర్‌లో మరో కేసు నమోదైంది. డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్, హిమాంశు మెహ్రా, గౌరవ్ సోలంకి, అపర్ణ పురోహిత్, అమిత్ అగర్వాల్‌ పేర్లు ఎఫ్ఐఆర్ లో చేర్చారు.