Begin typing your search above and press return to search.

దాసరి దర్శకుడు మాత్రమే కాదు .. ఓ అసాధారణ శక్తి!

By:  Tupaki Desk   |   5 May 2021 9:30 AM GMT
దాసరి దర్శకుడు మాత్రమే కాదు .. ఓ అసాధారణ శక్తి!
X
తెలుగు తెరతో పరిచయం ఉన్న వారికి దాసరి నారాయణరావు పేరు తెలియకుండా ఉండదు. ఎన్నో సినిమాలకి ఆయన దర్శకత్వం వహించారు. దర్శకుడిగా 'తాతా మనవాడు'తో మొదలైన ఆయన ప్రస్థానం నాన్ స్టాప్ గా కొనసాగింది. 'బొబ్బిలి పులి' .. 'ప్రేమాభిషేకం' .. 'గోరింటాకు' .. 'శివరంజని' .. ఇలా చెబుతూ వెళితే, ఎన్నో విభిన్నమైన .. విలక్షణమైన సినిమాలు ఆయన ఖాతాలో కనిపిస్తాయి. అలాంటి దాసరిని గురించి తాజా ఇంటర్వ్యూలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు.

"దాసరి నారాయణరావుగారిని మొదటిసారిగా నేను 'తాతా మనవడు' సినిమా ఫంక్షన్లో కలిశాను. నేను ఒక నిర్మాత కొడుకుని కావడంతో అలాగే మా పరిచయం జరిగింది. నేను చిరంజీవిగారితో 'మొగుడు కావాలి' సినిమాను నిర్మించే సమయానికి, దాసరినారాయణ రావుగారు పెద్ద దర్శకుడైపోయారు. అయినా మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. నాకు ఇతర భాషా చిత్రాలపై మంచి పట్టు ఉండేది. అలాగే కథలపై మంచి అవగాహన ఉండేది. అందువలన తన సినిమా కథలను ముందుగా ఆయన నాకు వినిపించేవారు.

చిత్రపరిశ్రమ హైదరాబాద్ వచ్చిన తరువాత మా మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. ఒకరి సినిమాలను గురించి ఒకరం తరచూ మాట్లాడుకుంటూ ఉండేవారం. దాసరి గారు ఎప్పుడూ సినిమాను గురించే ఆలోచన చేస్తూ ఉండేవారు .. ఆయనకి మరో ధ్యాస ఉండేది కాదు. అందువల్లనే ఆయన 160 సినిమాలకి దర్శకత్వం చేయగలిగారు. చాలా సినిమాలకు ఆయనే కథ ... మాటలు .. పాటలు రాసుకునేవారు. దర్శకుడిగా మాత్రమే కాదు నిర్మాతగానూ .. నటుడిగాను ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. అంతటి ప్రతిభాశాలిని నేను చూడలేదు. ఆయన కేవలం ఒక దర్శకుడు మాత్రమే కాదు .. ఒక అసాధారణమైన శక్తి .. అంతే! అని చెప్పుకొచ్చారు.