Begin typing your search above and press return to search.

'బాహుబలి' కోసం అప్పుడలా ఎగబడి.. ఇప్పుడేమో

By:  Tupaki Desk   |   2 Oct 2022 12:30 AM GMT
బాహుబలి కోసం అప్పుడలా ఎగబడి.. ఇప్పుడేమో
X
దేశం మొత్తం గురించి ప్రస్తావించేటపుడు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనే మాట ప్రస్తావిస్తుంటాం. కశ్మీర్‌లో కొన్ని రోజుల ముందు వరకు థియేటర్లు, అందులో సినిమాల ప్రదర్శనలు లేవు కాబట్టి దాన్ని పక్కన పెడితే.. దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన సినిమా ఏద అంటే మరో మాట లేకుండా ‘బాహుబలి’ పేరే చెప్పాలి. ఇన్నేళ్ల ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఆ సినిమా స్థాయిలో మరేదీ రీచ్ సాధించలేదు అంటే అతిశయోక్తి కాదు.

‘షోలే’ లాంటి సినిమాలు కూడా దేశమంతా బాగానే ఆడాయి కానీ.. మరీ ‘బాహుబలి’ స్థాయిలో దేశం నలుమూలలకూ విస్తరించలేదు. కానీ ‘బాహుబలి: ది కంక్లూజన్’ మాత్రం దేశంలో థియేటర్ ఉన్న ప్రతి చోటకు వెళ్లింది. అసాధారణ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. మా సినిమానే గొప్ప, ఇంకెవరి సినిమాలూ మాకు పట్టవు అన్నట్లు ఉండే తమిళ ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఎంతగానో ఎగబడ్డారు. ఇప్పటికీ తమిళనాడులో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ‘బాహుబలి’ ఒకటి.

ఐతే అప్పుడు ఆ సినిమా కోసం అంతగా ఎగబడి, దాన్ని కొనియాడిన తమిళ ప్రేక్షకులు ఇప్పుడు మాత్రం ఆ సినిమాను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడి సినీ సమీక్షకులైతే నేరుగా, పరోక్షంగా ‘బాహుబలి’ని విమర్శిస్తున్నారు.

‘పొన్నియన్ సెల్వన్’ సినిమా గురించి చెబుతూ.. ఇందులో అసదర్భంగా ఐటెం సాంగ్ లేదు. మైండ్ లెస్ మాస్ ఎలవేషన్లు లేవు.. వాస్తవ విరుద్ధమైన యాక్షన్ బ్లాక్స్, అతిశయోక్తులు లేవు.. కేవలం జరిగిన చరిత్రను అద్భుత రీతిలో కళ్లముందుకు తీసుకొచ్చాడు మణిరత్నం అంటూ పరోక్షంగా ‘బాహుబలి’ని విమర్శిస్తున్నారు.

కొందరైతే నేరుగా ‘బాహుబలి’ పేరు పెట్టి ‘పొన్నియన్ సెల్వన్’ అలాంటి మసాలా మూవీ కాదు.. ఇదొక క్లాసిక్, ఒరిజినల్ ఫిలిం అంటూ తమ సినిమాను లేపుకొంటున్నారు. అప్పుడు ఆ సినిమాను నెత్తిన పెట్టుకుని ఇప్పుడు తమ సినిమా తమిళనాడును దాటి ఇంకెక్కడా పెద్దగా ప్రభావం చూపకపోవడంతో అసూయ పడి ఈ కామెంట్లు చేస్తున్నట్లుందే తప్ప.. ‘బాహుబలి’ని ఇప్పుడు అకారణంగా నిందించడం, తక్కువ చేసే ప్రయత్నంలో అర్థం లేదనే చెప్పాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.