సర్కార్ లో 'అమ్మ' కు అవమానం...?

Thu Nov 08 2018 14:03:09 GMT+0530 (IST)

విలక్షణ దర్శకుడు మురుగ దాస్ - విజయ్ ల కాంబోలో వచ్చిన `సర్కార్`చిత్రం హిట్ టాక్ తో దూసుకుపోతోంది. తమిళనాట ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ చిత్రంపై విడుదలకు ముందే వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ కథ తనదేనంటూ  ఓ రచయిత ఆరోపించడంతో...మురుగదాస్ అతడికి నచ్చజెప్పి వివాదం సద్దుమణిగేలా చేశారు. అయితే తాజాగా ఆ చిత్రం మరో వివాదంలో చిక్కుకుంది. ఆ సినిమాలో లేడీ విలన్ గా నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర ....దివంగత ముఖ్యమంత్రి జయలలితను పోలి ఉందంటూ ఏఐడీఎంకే ఆరోపిస్తోంది. వెంటనే ఆ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని అన్నా డీఎంకే మంత్రుల `సర్కార్`టీంకు వార్నింగ్ ఇచ్చారు.
 
అట్లీ విజయ్ ల కాంబోలో వచ్చిన `మెర్సల్` లో జీఎస్టీ - నోట్ల రద్దు - వైద్య విధానం వంటి విషయాలపై సెటైర్లు వేయడం దుమారం రేపింది. అప్పుడు బీజేపీ నాయకులు...ఈ సినిమాను వ్యతిరేకించారు. తాజాగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంపై మురుగదాస్ - విజయ్ లు సెటైర్లు పేల్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. జయలలిత ప్రవేశ పెట్టిన ఉచిత పథకాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తన పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తండ్రిని కూడా హత్య చేసే `కోమలవల్లి` పాత్రలో వరలక్ష్మి నటించింది. జయలలిత అసలు పేరు కోమలవల్లి కావడం...ఆమె కట్టుబొట్టు జయలలితని పోలి ఉండడంతో ఏఐడీఎంకే నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివాదాస్పద సన్నివేశాల్ని వెంటనే తొలగించాలని ఏఐడీఎంకే మంత్రులు ..చిత్ర యూనిట్ ను హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు సగటు పౌరుడికి కూడా ఉంటుందని కానీ సర్కార్ చిత్రం హింసని ప్రేరేపించే విధంగా ఉందని తమిళనాడు న్యాయ శాఖా మంత్రి షణ్ముగం అన్నారు. కోమలవల్లి వివాదాస్పద సీన్లు తొలగించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.