ఈ శక్తిమంతమైన యుద్ధ ట్యాంకులతో ఉక్రెయిన్ ఖేల్ ఖతమేనా?

Sat Sep 24 2022 20:22:33 GMT+0530 (India Standard Time)

T62 battle tanks

తమ మాట పెడ చెవినపెట్టి అమెరికా దాని మిత్ర దేశాల సైనిక కూటమి అయిన ఉత్తర అట్లాంటిక్ సంధి వ్యవస్థ (నాటో)లో చేరడానికి ఉవ్విళ్లూరుతున్న ఉక్రెయిన్‌పై రష్యా ఆరు నెలల క్రితం యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ఇప్పటికే వేలాది మంది ఉక్రెయిన్ ప్రజలు మరణించారు. అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ కెనడా ఆస్ట్రేలియా తదితర దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ రష్యా.. ఉక్రెయిన్ అంతమే తన పంతం అన్నట్టు ముందుకు వెళ్తూనే ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకుంది. ఉక్రెయిన్‌కు సముద్ర తీరమనేది లేకుండా చేసింది. ఆక్రమించిన ప్రాంతాలను రష్యాలో కలుపుకోవడానికి ప్రజాభిప్రాయసేకరణ కూడా చేస్తోంది.మరోవైపు యుద్ధం మొదట్లో రష్యా ధాటికి బేజారెత్తిన ఉక్రెయిన్.. ఇప్పుడు ధీటైన పోటీ ఇస్తోంది. అమెరికా బ్రిటన్ తదితర దేశాలు ఆయుధాలు అందిస్తుండటంతో రష్యాకు లొంగిపోకుండా పోరాడుతోంది. మొదట్లో రష్యాకు తాము కోల్పోయిన ప్రాంతాలను ఒక్కొక్కటిగా చేజిక్కుంచుకుంటోంది. దీంతో రష్యా వెనుకబడిందని తాజాగా వార్తలు వస్తున్నాయి.

దీంతో ఇప్పటిదాకా తాము విధ్వంసక ఆయుధాలను వాడలేదని.. ఇప్పుడు పెద్ద ఎత్తున సైనిక బలగాలతోపాటు శక్తిమంతమైన ఆయుధాలను దించి ఉక్రెయిన్ అంతు చూస్తామని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ రంకెలేస్తున్నారు. అందులో భాగంగా రష్యా భారీగా శక్తిమంతమైన యుద్ధ ట్యాంకులను రంగంలోకి దింపుతోంది.

అయితే ఫిబ్రవరి 27న యుద్ధం మొదలయినప్పటి నుంచి రష్యా దాదాపు 2000 యుద్ధ ట్యాంకులను నష్టపోయింది. దీంతో రష్యా తన అమ్ములపొదిలోని అత్యంత కీలకమైన టీ 62 యుద్ధ ట్యాంకులను రంగంలోకి దించనుంది. ఇవి యుద్ధంలో కీలకపాత్ర పోషించగలవని చెబుతున్నారు. వీటిని ఉక్రెయిన్ తట్టుకోలేదని అంటున్నారు. టీ 62 యుద్ధ ట్యాంకులతో రష్యా తన సత్తాను చూపించాలనే కృతనిశ్చయంతో ఉందని వార్తలు వస్తున్నాయి.

సాక్షాత్తూ రష్యాకు శత్రువుగా మారి.. ఉక్రెయిన్‌కు మద్దతు ఆయుధాలు అందిస్తున్న బ్రిటన్ సైతం రష్యా యుద్ధ ట్యాంకులు అత్యంత ప్రమాదకరమని చెబుతుండటం గమనార్హం. ఈ యుద్ధ ట్యాంకుల ముందు ఉక్రెయిన్ నిలబడలేదని బ్రిటన్ చెబుతోంది. రష్యా తాను యుద్ధంలో ఓడిపోతానన్న అనుమానం ప్రాంభమైన వెంటనే విధ్యంసకర దాడికి దిగుతుందని అమెరికాతోపాటు ప్రపంచ దేశాల మొదట్లోనే సందేహించాయి. ఇప్పుడు అవి ఊహించినట్టే రష్యా భీకర దాడికి సిద్ధమవుతోంది.

కాగా ఒకప్పటి యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్ (యూఎస్ఎస్ఆర్) ఉత్పత్తి చేసిన చివరి మీడియం ట్యాంకులే టీ62 యుద్ధ ట్యాంకులు. ఈ టీ 62 ట్యాంకులను సెమీ ఆటోమేటిక్ 115 ఎంఎం స్మూత్‌బోర్ గన్‌తో నిర్మించారు. పైగా ఆ ట్యాంకులకు సంబంధించిన వీడియోని కూడా ఉక్రెయిన్ ప్రభుత్వ సలహాదారు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడు ఆ వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.