అక్కినేని అంటించిన బర్త్ డేల పిచ్చి!

Tue Sep 17 2019 07:00:02 GMT+0530 (IST)

T Subbarami Reddy on about Akkineni Family

కళాబంధు .. నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి బర్త్ డే 17 సెప్టెంబర్. ఈ సందర్భంగా వైజాగ్ లో భారీగా జనసందోహం నడుమ ఆయన బర్త్ డే వేడుకలకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఓ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఈ ఇండస్ట్రియలిస్ట్ కం నిర్మాత పలు ఆసక్తికర సంగతుల్ని రివీల్ చేశారు. అసలు మీరు ఆధ్యాత్మికత వైపు మిమ్మల్ని అడుగులు వేయించిన సంఘటన ఏదైనా ఉందా? అని ప్రశ్నిస్తే..నాలో ఆధ్యాత్మికతకు కారణం ఎన్టీ రామారావు అని చెప్పారు. చిన్న వయసులో భూకైలాస్ సినిమా చూశాను. అందులో ఎన్టీఆర్ రావణ పాత్రలో ఓం నమశ్వివాయ అంటూ తపస్సు చేస్తుంటే ఈశ్వరుడి వరం లభిస్తుంది. అప్పటి నుంచే ఓం నమశ్వివాయ అంటూ మనసులో భక్తి మొదలైంది. ఆయనే నా ఆధ్యాత్మిక తొలి స్ఫూర్తి అని అన్నారు.

మీలోని ఆధ్యాత్మిక వేత్తకు స్ఫూర్తి ఎవరు? ఎవరైనా ప్రత్యక్ష గురువు ఉన్నారా?  అని ప్రశ్నిస్తే తిరుపతితో తనకు ఎంతో అనుబంధం ఉందని ఆ తర్వాత వైజాగ్ లో స్వరూపానంద స్వామీజీతో బంధం అందుకు కారణమని తెలిపారు. వారి నుంచి మంత్రాలు శాస్త్రం నేర్చుకునే స్ఫూర్తి వచ్చింది. వేదికలపైనా మంత్రం చెప్పడానికి కారణం దైవశక్తి గురించి తెలియాలనే. మంత్రంతో పాటు ఉపన్యాసం అన్నది నా శైలి. దైవాన్ని స్మరించాలంటే మంత్రం తెలియాలి. అవి ఎవరికి తెలుసు? ఈరోజుల్లో ఎవరైనా మంత్రాలు చదవగలరా?  మన ప్రతిభ తెలియాలి. ప్రజలకు ఉపయోగం ఉండాలనే మంత్రాలు చదువుతాను.. అని తెలిపారు.

అసలు బర్త్ డేలు చేసుకోవాలన్న ఆసక్తి ఎందుకు కలిగింది? అంటే.. దానికి అక్కినేని స్ఫూర్తి. మా పక్కింట్లో ఉన్నప్పుడు ఆయన బర్త్ డేకి బస్సుల్లో అభిమానులు వచ్చారు. ఆయన్ని చూసి నాకు కూడా బర్త్ డే చేసుకోవాలనిపించింది. అలా మొదలైంది ఆ పిచ్చి. 30 ఏళ్లుగా విశాఖపట్నంలో ఉంటున్నా. అక్కడ ప్రజలంతా బర్త్ డే రోజు కలిసి శుభాకాంక్షలు తెలిపేవారు. అక్కినేని వచ్చినా వైజాగ్ కి మా ఇంటికొచ్చేవారు. నేను ఈశ్వర భక్తుడిని. అందుకే కళాకారుడి సేవ అంటే ఈశ్వర సేవ అని భావిస్తాను. కళ అంటే ఈశ్వర తపస్సు అని భావిస్తాను. అందుకే అందరికీ నా పుట్టినరోజున అవార్డులు ఇస్తాను. విశాఖలో ప్రధాన అర్చకులతో పూజలు  చేయించి కళాకారుల్ని సత్కరిస్తాను. నా ప్రతి బర్త్ డేకి కళాకారులకు సేవలందిస్తాను అని తెలిపారు టీఎస్సార్.