Begin typing your search above and press return to search.

సైరా: ప్యాన్ ఇండియా.. ప్రయత్నాలు సరిపోలేదు!

By:  Tupaki Desk   |   9 Oct 2019 2:30 PM GMT
సైరా: ప్యాన్ ఇండియా.. ప్రయత్నాలు సరిపోలేదు!
X
'బాహుబలి' ఫ్రాంచైజీలో రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధించిన తర్వాత సౌత్ ఫిలిం మేకర్లకు ప్యాన్ ఇండియా సినిమాలపై దృష్టిపడింది. అయితే కొందరు మేకర్లు ఈ ప్యాన్-ఇండియా(దేశ వ్యాప్తంగా అని అర్థం) లెవెల్ లో సినిమాను రిలీజ్ చేయాలనుకోవడం మంచి పరిణామమే కానీ ప్రతి సినిమాకు ప్యాన్ ఇండియా స్కేల్ రాదు. 'బాహుబలి' తర్వాత ఆ స్థాయిలో కాకపోయినా రిలీజ్ అయిన ప్రతి భాషలోనూ ప్రేక్షకులను మెప్పించిన చిత్రం 'కె.జీ.ఎఫ్'. ఇక మిగతా సినిమాలన్నీ చతికిలపడ్డవే. ప్రభాస్ 'సాహో' హిందీలో సూపర్ హిట్ అయింది కానీ తమిళ.. మలయాళ భాషల్లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తెలుగులో కూడా నష్టాలు తప్పలేదు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' ను ప్యాన్ ఇండియా సినిమాగానే ప్రొజెక్ట్ చేశారు. సినిమాలో మంచి కంటెంట్ కూడా ఉంది కానీ ఈ సినిమా తెలుగు వెర్షన్ తప్ప మిగతా వెర్షన్ ఏవీ ప్రభావం చూపలేకపోయాయి. నిజానికి హిందీ వెర్షన్ రివ్యూస్ పాజిటివ్ గా ఉన్నాయి. 'వార్' కంటే బెటర్ రివ్యూస్ వచ్చాయి. ఇతర భాషలలో కూడా డీసెంట్ రివ్యూస్ తెచ్చుకున్నా కలెక్షన్స్ మాత్రం కనీస స్థాయిలో కూడా లేవు. మరి దీనికి కారణాలు ఏవి?

కొందరేమో బాలీవుడ్ వారు మనపై కత్తిగట్టి.. పగబట్టి సౌత్ సినిమాలను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. నిజానికి బాలీవుడ్ లో ఎవరికీ అంత ఓపిక తీరిక ఉండదు. ఎవరిది వారు కడుక్కునేందుకే అక్కడ టైం ఉండదు. వారి సినిమాలు ఎలా హిట్ చేసుకోవాలో చూస్తారు తప్ప సౌత్ నుంచి వచ్చే ప్రతి సినిమాను టార్గెట్ చెయ్యడం వారి పని కాదు. పైగా ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించారు. పాపులర్ ఫిలిం మేకర్ ఫర్హాన్ అఖ్తర్ 'సైరా' ను హిందీలో స్వయంగా రిలీజ్ చేశారు. సో.. 'సైరా' ను బాలీవుడ్ లో తొక్కారు అనడం ఆధారాలు లేని వాదన మాత్రమే.

ఇక ఈ సినిమా హిందీ వెర్షన్ దారుణ ఫలితం వెనక రెండు మూడు కారణాలు ఉన్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అందులో ఒకటి చిరు వయసు. ఆయన మన తెలుగు వారికి మెగాస్టార్.. హిందీవారికి కాదు. ఇది కఠిన వాస్తవం. ఆయన 60 లలో ఈ ఫీట్లు చేసి.. రొమాన్స్ చేస్తే మనం మురిసిపొతామేమో కానీ హిందీ ప్రేక్షకులకు కనెక్ట్ కాదు. వారికి ఇది కొత్త హీరో సినిమాలాంటిది. రెండవ కారణం ఏంటంటే.. ఈ దేశభక్తి థీమ్ చిత్రాలు తెలుగులో తక్కువ కానీ హిందీలో రెగ్యులర్ గా వస్తుంటాయి. ఫ్రీడం ఫైట్ నేపథ్యం సినిమాలు వారికి ఏమాత్రం కొత్తగా అనిపించవు.

మరో కారణం ఏంటంటే.. ప్రమోషన్స్. సైరా కు హిందీ వెర్షన్ ప్రమోషన్స్ చాలా చాలా వీక్ అని ఎవరిని అడిగినా చెప్తారు. ప్రభాస్ లాంటి క్రేజ్ ఉన్న హీరోనే 'సాహో' హిందీ ప్రమోషన్స్ పై ఎంత శ్రద్ధ చూపించాడో అందరికీ తెలుసు. కరెక్ట్ గా చెప్తే 'సైరా' హిందీ వెర్షన్ కు జీరో ప్రమోషన్స్ కిందే లెక్క. ప్రమోషన్స్ స్ట్రాంగ్ గా చేసి ఉంటే మాత్రం ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చి ఉండేవనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఏదేమైనా 'సైరా' ను ప్యాన్ ఇండియా సినిమాగా ప్రొజెక్ట్ చేయాలనే ఆలోచన మంచిదే కానీ ప్రయత్నాలు మాత్రం అందుకు తగ్గట్టుగా లేవు.