Begin typing your search above and press return to search.

సైరా బుల్లితెర‌పై ఎందుకు ఫెయిల్?

By:  Tupaki Desk   |   23 Jan 2020 12:35 PM GMT
సైరా బుల్లితెర‌పై ఎందుకు ఫెయిల్?
X
2019 ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా రిలీజ్ అయిన `సైరా న‌ర‌సింహారెడ్డి` బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఫ‌లితాలు సాధించిందో తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెర‌కెక్కిన ఈ సినిమా మెగా అభిమానుల‌కు ఓ స్వీట్ మెమ‌రీగా నిలిచింది. మెగాస్టార్ కి చెర్రీ ఇచ్చిన స్వీట్ గిఫ్ట్ ఇది. అయితే తెలుగు రాష్ట్రాల్లో బంప‌ర్ హిట్ కొట్టిన ఈ చిత్రం హిందీ నాట క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్ట‌డంలో విఫ‌ల‌మైంది. రిలీజైన అన్నిచోట్లా క్రిటిక్స్ ప్ర‌శంసించినా.. రివ్యూలు బావున్నా.. ప్ర‌ముఖులంతా ప్ర‌శంస‌లు కురిపించినా.. అది క‌లెక్ష‌న్ల రూపంలోకి మార‌క‌పోవ‌డం నిరాశ‌ప‌రిచింది. పాన్ ఇండియా కేట‌గిరీకి చెందినా ప్ర‌చార వ్యూహం మిస్ ఫైరైంది.

ఇక పెద్ద‌తెర‌పై రిజ‌ల్ట్ అలా ఉంటే.. బుల్లితెర టీఆర్పీలో సైరా -న‌ర‌సింహారెడ్డి ఏమేర‌కు రాణించింది? అంటే.. ఈ సినిమా ప్రీమియ‌ర్ సంక్రాంతి వేళ జెమినీ టీవీలో వేశారు. సంక్రాంతి సీజ‌న్.. ప్రేక్ష‌కుల‌కు టీవీల‌కు అతుక్కుపోయే సీజ‌న్ కాబ‌ట్టి మంచి టీ.ఆర్.పీ వ‌స్తుంద‌ని భావించి టెలికాస్ట్ చేసారు. కానీ సైరా ఆశించిన టీ.ఆర్‌.పీని రాబ‌ట్ట‌లేక‌పోయింది. కేవ‌లం 11.8 టీఆర్ పీ మాత్ర‌మే ద‌క్కించుకోగ‌లిగింది. ఇదే స‌మ‌యంలో `సైరా` త‌మిళ్ వెర్ష‌న్ స‌న్ టీవీలో వేస్తే.. తంబీ ప్రేక్ష‌కులే బుల్లి తెర‌పై గొప్ప‌గా ఆద‌రించారు. మ‌రో ట్విస్ట్ ఏంటంటే? సైరా ప్రీమియ‌ర్ స‌మ‌యంలోనే స్టార్ మాలో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన గ‌ద్ద‌ల‌కొండ కూడా టెలీకాస్ట్ అయ్యింది. సైరాను మించిన టీఆర్పీని అందుకుంది.

హీరోల మ‌ధ్య సారూప్య‌త లేక‌పోయినా.. ఇంత‌ వ్య‌త్యాసం ఎందుకు? అంటే తెలుగు నాట జ‌నం థియేట‌ర్ల‌లో వీక్షించేందుకు ఇష్ట‌ప‌డ్డారు. అందువ‌ల్ల టీవీ తెర‌పై సైరాను చూడ‌లేదు. త‌మిళ‌నాట జ‌నం థియేట‌ర్ల‌కు వ‌చ్చేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. అందుకే సైరా చిత్రాన్ని టీవీలో చూశారు అన్న‌ది ఓ విశ్లేష‌ణ‌. ఇక తెలుగునాట అంత‌గా పాపుల‌ర్ కాని చానెల్లో వేయ‌డం వ‌ల్ల‌నే ఇలా అయ్యింది అన్న ఆరోప‌ణ‌లు మెగాఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్నాయి. అంత‌గా మార్కెట్ లేని ఛాన‌ల్స్ లో టెలికాస్ట్ అయితే మొత్తానికి కొంపు మునుగుతుంద‌ని ప్రూవ్ అయ్యిందన్న‌ది మ‌రో వాద‌న‌.