సుశాంత్ మాజీ అసిస్టెంట్ బయటపెట్టిన షాకింగ్ విషయాలు...!

Tue Aug 04 2020 23:19:08 GMT+0530 (IST)

Shocking things revealed by Sushant's former assistant ...!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతికి సంబంధించి రోజులు గడిచే కొద్దీ అనేక విషయాలు బయటకి వస్తున్నాయి. ముందుగా సుశాంత్ డిప్రెషన్ కి ఇండస్ట్రీలోని నెపోటిజం మరియు పలువురు ప్రముఖులు కారణమనే వాదనలు వినిపించాయి. ఆ తర్వాత అసలు సుశాంత్ ది సూసైడ్ కాదని.. అతన్ని ప్లాన్ ప్రకారమే హత్య చేసారని.. ఈ కేసుని సీబీఐ దర్యాప్తుకి ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఇటీవల సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నా పోలీసులకు అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు పలువురిపై ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు కేసు మొత్తం రియా చుట్టూనే తిరుగుతోంది. అప్పటి నుండి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన రియా చక్రవర్తి కోసం బీహార్ పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం సుశాంత్ ఆత్మహత్య కేసుని సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించింది.కాగా సుశాంత్ మాజీ అసిస్టెంట్ అంకిత్ ఆచార్య మరికొన్ని కీలక విషయాలను బయటపెట్టాడు. ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంకిత్ మాట్లాడుతూ.. సుశాంత్ తో మూడు సంవత్సరాలు అతని నీడలా కలిసి ఉన్నాను.. సుశాంత్ ఎలాంటి మెడిసిన్ వాడే వాడు కాదని.. ఆ మూడేళ్లలో సుశాంత్ భయ్యా ఇంట్లో ఉండగా లోపల వైపు లాక్ చేయడం తానెప్పుడూ చూడలేదని పేర్కొన్నాడు. గతేడాది ఆగస్ట్ లో తాను సొంతూరు వెళ్లి తిరిగి వచ్చేసరికి సుశాంత్ వ్యక్తిగత సిబ్బందిని మార్చేశారని.. గతంలో పనిచేసిన వారెవరూ లేరని.. సుశాంత్ దగ్గర కొత్తగా పనిచేస్తున్న బాడీగార్డ్స్ తనను ఇంట్లోకి కూడా అనుమతించలేదని అంకిత్ వెల్లడించారు. అంతేకాకుండా స్టాఫ్ ని రియా చక్రవర్తి చేంజ్ చేసి ఉండొచ్చని తాను భావించినట్లు చెప్పాడు. సుశాంత్ కి మెడిసిన్స్ నుండి ఫుడ్ వరకూ అన్ని రియానే ఇచ్చేదని.. సర్వెంట్స్ ఎవరిని ఈ విషయంలో దగ్గరకు రానిచ్చేది కాదని నేను విన్నానని తెలిపాడు.

ఇక లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో తనకు ఇవ్వాల్సిన డబ్బును తీసుకోడానికి సుశాంత్ ను కలిశానని.. అప్పుడు అతను పూర్తిగా మారిపోయాడని.. సుశాంత్ ముఖంలో నవ్వు లేదని అంకిత్ చెప్పాడు. సుశాంత్ అకౌంట్ లో 2019లో రూ.30 కోట్లు ఉన్నాయని.. సుశాంత్ డబ్బును రియా విచ్చలవిడిగా ఖర్చు చేసేదని అంకిత్ చెప్పాడు. రియా ఎటువంటి విగ్రహాలు లేకుండా సుశాంత్ ఇంట్లో పూజలు నిర్వహించిందని తెలిపాడు. అంతేకాకుండా సుశాంత్ సింగ్ రియాతో కలిసి వెళ్లిన యూరప్ ట్రిప్ తర్వాత చాలా చేంజ్ అయ్యారని అంకిత్ ఆచార్య చెప్పుకొచ్చారు. ఇంతకముందు సుశాంత్ వంట మనిషి కూడా యూరప్ ట్రిప్ తర్వాత సుశాంత్ లో మార్పు కనిపించినట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.