Begin typing your search above and press return to search.

సెన్సార్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అయిన సూర్య సినిమా...!

By:  Tupaki Desk   |   6 Jun 2020 10:50 AM GMT
సెన్సార్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అయిన సూర్య సినిమా...!
X
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు టాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ మధ్య సూర్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలబడిపోతున్నాయి. వరుస ఫెయిల్యూర్స్‌ తో తెలుగులో సూర్య మార్కెట్ క్రమంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని 'గురు' వంటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న లేడీ డైరెక్టర్ సుధా కొంగర డైరెక్షన్ లో 'సూరారై పొట్రు' అనే సినిమాను తెరకెక్కించేసాడు సూర్య. సామాన్యుడికి సైతం విమాన సౌకర్యం అందించిన ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జేబులో ఆరు వేల రూపాలు పెట్టుకుని సిటీకి వచ్చిన వ్యక్తి విమాన కంపెనీని ఎలా స్థాపించాడు.. ఆ సమయంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు ఇందులో చూపించనున్నారు. 'కలలు కనడం మానవ సహజం.. వాటిని సాకారం చేసుకోవడం కష్టం.. తాము కన్న కలల్ని సాకారం చేసుకుని ఇతరుల్లో స్ఫూర్తి నింపాలి' అనే ఇతివృత్తంతో వస్తున్న ఈ సినిమా తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' అనే పేరుతో విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

కాగా తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుని రిలీజ్‌ కు రెడీ అయ్యింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు ఎలాంటి కటింగ్స్ లేకుండా క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ జారీ చేశారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్‌ లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా లాక్‌ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక థియేటర్లు తెరుచుకున్న వెంటనే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సూర్య అండ్ టీమ్ రెడీ అవుతున్నారట. ఇప్పటికే ఈ మూవీ థియేటర్ రిలీజ్ కి వెళ్ళబోతున్నట్లు సూర్య ప్రకటించారు. అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య నిర్మిస్తున్నాడు. మోహన్ బాబు, జాకీష్రాఫ్, పరేష్ రావల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. గత కొంత కాలంగా వరస పరాజయాలను ఎదుర్కొంటున్న సూర్యకు ఈ సినిమా విజయం కీలకం కానుంది. కాగా ఇటీవల తన భార్య జ్యోతిక సినిమా ఓటీటీ రిలీజ్ ని వ్యతిరేకిస్తూ థియేటర్స్ యాజమాన్య సంఘాలు సూర్య సినిమాలు తమిళనాడులో విడుదల కానివ్వం అని హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో క్లీన్ 'యూ' సెన్సార్ సర్టిఫికెట్ పొందిన 'సూరారై పొట్రు' థియేటర్స్ లోకి ఎప్పుడు రాబోతుందో చూడాలి.