ఆమె మళ్లీ నా జీవితంలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తా

Sun Sep 20 2020 17:01:23 GMT+0530 (IST)

Surya Kiran About Kalyani

సత్యం సినిమాతో దర్శకుడిగా ఒక్కసారిగా స్టార్ అనిపించుకున్న సూర్య కిరణ్ ఆ తర్వాత చేసిన సినిమాలు నిరాశ పర్చడంతో మెల్ల మెల్లగా డైరెక్షన్ కు దూరం అవుతూ వచ్చాడు. సొంతంగా సినిమా తీసినా కూడా అది ఆడక పోవడంతో నిర్మాతగా కూడా నష్టపోయాడు. మళ్లీ దర్శకత్వం చేయాలనే ప్రయత్నాల్లో ఉన్న సూర్య కిరణ్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ కనిపించి అందరిని ఆశ్చర్య పర్చాడు. సూర్య కిరణ్ బలమైన కంటెస్టెంట్ అనుకున్నప్పటికి ఆయన మొదటి వారంలోనే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఎలిమినేట్ అయిన తర్వాత సూర్య కిరణ్ కు సంబంధించిన వ్యక్తిగత విషయాలు చాలా ఆయన ఇంటర్వ్యూల ద్వారా తెలుస్తున్నాయి.సూర్య కిరణ్ హీరోయిన్ కళ్యాణిని పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెల్సిందే. కాని వారిద్దరు నాలుగేళ్ల క్రితం విడాకులు తీసుకున్న విషయం మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. సూర్య కిరణ్ తాజా ఇంటర్వ్యూల్లో అన్ని చోట్ల కూడా ఆ విషయాన్ని చెబుతున్నాడు. మేమిద్దరం ఎలాంటి కారణం లేకుండా విడిపోయాం. కళ్యాణి గారి ఇష్టం ప్రకారం విడాకులు తీసుకున్నాం అంటూ కళ్యాణి పైనే మొత్తం నెట్టి వేశాడు. దానికి తోడు నేను ఇప్పటికి కళ్యాణిని ప్రేమిస్తున్నాను. నాకు ఈ జీవితంకు కళ్యాణి గారు మాత్రమే భార్య మరెవ్వరు ఆలోచన కూడా లేదు అంటూ సూర్య కిరణ్ చెప్పుకొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూలో మరోసారి కళ్యాణి గురించి మాట్లాడుతూ... ఆమె నా జీవితంలోకి మళ్లీ వస్తే చాలా సంతోషం. ఆమెను సాదరంగా ఆహ్వానించేందుకు నేను రెడీగా ఉన్నాను. ఆమె నా వద్దకు రాకున్నా కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆమె సినిమా చేస్తుంది. అది బాగా వచ్చింది. మేము విడిపోయిన తర్వాత కూడా స్నేహితుల మాదిరిగా ఉన్నాం అంటూ కళ్యాణిపై ప్రేమను సూర్య కిరణ్ ప్రదర్శించేందుకు ప్రతి ఇంటర్వ్యూలో ప్రయత్నిస్తున్నాడు. మరి సూర్య కిరణ్ ప్రేమను కళ్యాణి గుర్తిస్తుందా.. అసలు కళ్యాణి ఈ విషయంలో ఎలా స్పందిస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.