Begin typing your search above and press return to search.

'ఆర్ ఆర్ ఆర్'లో అదిరిపోయే సర్ ప్రైజ్ ఉందన్న రాజమౌళి!

By:  Tupaki Desk   |   16 March 2022 3:30 PM GMT
ఆర్ ఆర్ ఆర్లో అదిరిపోయే సర్ ప్రైజ్ ఉందన్న రాజమౌళి!
X
రాజమౌళి తన సినిమాల విషయంలో ఒక యజ్ఞం చేస్తారు. చివరి నిమిషం వరకూ తన నుంచి ఎంత అవుట్ పుట్ ఇవ్వగలరో అంతా ఇచ్చేస్తారు. సినిమా అనేది దృశ్య ప్రధానమైనది .. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకుని వెళ్లవలసిన బాధ్యత దర్శకుడిదే. ఆయన వెంట ప్రేక్షకులు వెళ్లలేదంటే ఆ సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదని అర్థం. అందువల్లనే ఏ సన్నివేశంలో నుంచి కూడా ప్రేక్షకుడు జారిపోకుండా ఆయన చూసుకుంటూ ఉంటారు. పాటల విషయంలో కూడా ఆయన ఇదే పద్ధతిని అనుసరిస్తారు.

రాజమౌళి సినిమాలకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతూ ఉంటారు. ఇద్దరి మధ్య ఉన్న అవగాహన కారణంగా ఇంత దూరం కలిసి ప్రయాణం చేశారు. పాటకి ప్రాణం ఫీల్ .. ఆ ఫీల్ ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది. సన్నివేశంలో నుంచి పాటలోకి తీసుకుని వెళ్లడం .. ఆ పాటలో నుంచి తిరిగి సన్నివేశంలోకి ప్రేక్షకులను ప్రయాణం చేయించడమనే కళ రాజమౌళికి బాగా తెలుసు. 'ఆర్ ఆర్ ఆర్'ను కూడా ఆయన ఒక పాటల పండుగలా తీర్చిదిద్దారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన పాటలన్నీ అన్నివర్గాల వారికీ కనెక్ట్ అయ్యాయి.

అయితే థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకులను తాను సర్ ప్రైజ్ చేయనున్నట్టు రాజమౌళి చెప్పారు. ఆ సర్ ప్రైజ్ ఏమిటంటే చరణ్ - అలియా భట్ పై చిత్రీకరించిన పాట. ఈ ఒక్క పాటను మాత్రం బయటికి వదలకుండా థియేటర్ కి వెళ్ళినవారు సడన్ గా పొందే సర్ ప్రైజ్ గా రాజమౌళి అట్టే పెట్టాడన్న మాట. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనిపించనున్నాడు. ఆయన మనసు దోచుకున్న యువతిగా సీత కనిపించనుంది. ఈ ఇద్దరి ప్రేమ కూడా ప్రకృతితో పెనవేసుకుపోయినట్టుగా కనిపిస్తుంది. వారి ప్రయాణం ఎమోషన్ తో కొనసాగుతుంది.

అలాంటి అల్లూరి - సీత కాంబినేషన్లో ఒక అద్భుతమైన పాటను చిత్రీకరించారు. బాణీ పరంగా .. సంగీత సాహిత్యాల పరంగా .. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుందని చెబుతున్నారు. అలాంటి పాటను థియేటర్లో చూడవలసిందేనని అంటున్నారు.
ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా ఈ పాట నిలుస్తుందని చెబుతున్నారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అందువలన ఈ సినిమా ప్రమోషన్స్ లో రాజమౌళి టీమ్ బిజీగా ఉంది. తాజా ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ పాట గురించి చెప్పి ఊరించడంతో ఆడియన్స్ మరింత ఉత్సాహపడిపోతున్నారు.