Begin typing your search above and press return to search.

రానా హెల్త్ పై అసలు నిజాన్ని వెల్లడించిన సురేశ్ బాబు

By:  Tupaki Desk   |   15 Oct 2019 10:13 AM GMT
రానా హెల్త్ పై అసలు నిజాన్ని వెల్లడించిన సురేశ్ బాబు
X
ప్రముఖులతో వచ్చే చిక్కేమిటంటే.. తమ ఇమేజ్ ను పెంచుకునేందుకు అదే పనిగా మీడియాలో కనిపిస్తుంటారు. ఒకవేళ కనిపించే అవకాశం లేకుంటే.. కనిపించేలా చూడాలంటూ రిక్వెస్ట్ చేయటం ఇప్పటికి నడుస్తోంది. కాకుంటే.. ప్రముఖ మీడియా సంస్థల వారిని.. ప్రజల్ని ప్రభావితం చేసే మీడియా సంస్థల్ని అడుగుతుంటారు. ఎంత సోషల్ మీడియా వచ్చినా.. ఆయా మీడియా సంస్థలకు ఉన్న డిమాండ్ మాత్రం తగ్గట్లేదు. పాజిటివ్ అంశాల గురించి అంతలా పాకులాడే ప్రముఖులు.. నెగిటివ్ అంశాలున్నప్పుడు ముఖం చూపించటం కాదు కదా.. అసలే విషయం రాయొద్దని కోరటం ఈ మధ్యన ఎక్కువైంది.

దీని వల్ల జరుగుతున్న నష్టం ఏమిటంటే.. గాసిప్పులు ప్రచారమై.. అవి నిజాలుగా ప్రజలంతా నమ్మే పరిస్థితి వరకూ వెళుతోంది. ఉదాహరణకు ఎవరైనా సినీ ప్రముఖుడికి ఆరోగ్యం బాగోలేదనుకోండి.. ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పేసి.. ఎప్పటికప్పుడు వివరాల్ని మేం ఇస్తామన్నారనుకోండి.. ఇంకేం సమస్య ఉంటుంది. కానీ..గొప్పల విషయంలో అతి ప్రచారాన్ని కోరుకునే ప్రముఖులు.. మరికొన్ని అంశాల విషయంలో మాత్రం వార్తల్లో కనిపించకూడదనే కోరుకుంటారు.

గడిచిన కొద్ది రోజులుగా రానా దగ్గుబాటి ఆరోగ్యానికి సంబంధించి వస్తున్న వార్తలు అన్ని ఇన్ని కావు. యాక్టివ్ గా ఉండే రానా కనిపించకపోవటం.. ఈ మధ్యన ఆయన లుక్ దారుణంగా ఉండటం.. మాంచి శారీరక సౌష్టవంతో ఉండే ఆయన బక్కచిక్కిపోవటంతో పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనికి తోడు ఏమైందన్న విషయం మీద క్లారిటీ లేకపోవటం.. ఎవరికి తోచించి వారు రాసేసిన పరిస్థితి.

దీంతో.. రానాకు ఏదేదో అయిపోయిందంటూ రాతలు రాసేశారు. దగ్గుబాటి కుటుంబం కూడా ఇలాంటి వార్తల విషయంలో కామ్ గా ఉండటమే తప్పించి.. జరుగుతోంది ఇది కాదన్న మాట మాత్రం కూడా బయటకు చెప్పని పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో ఎవరి ఊహలకు తగ్గట్లు వారు.. ఎవరికి ఏం తెలిస్తే ఆ విషయాన్ని అలా అంట.. ఇలా అంట అని రాసేస్తుంటారు. ఈ తరహా వార్తలు రానా విషయంలో మరింత పెరిగిపోయాయి.

ఇలాంటి వేళలో తప్పదనుకున్నారేమో కానీ.. రానా తండ్రి దగ్గుబాటి సురేశ్ బాబు రంగంలోకి దిగారు.తన కొడుకు అనారోగ్యం మీద వస్తున్న వార్తల్లో నిజం లేదని.. కిడ్నీ లాంటి సమస్యలు లేవన్నారు. రానాకు చిన్నతనంలోనే కంటి సమస్య ఉందని.. అప్పుడే చికిత్స చేస్తే చిన్నవాడు తట్టుకోలేడని వైద్యులు చెప్పారని.. ఈ మధ్యే చికిత్స చేసినట్లు పేర్కొన్నారు.

సర్జరీ తర్వాత టెన్షన్ పడటంతో బీపీ లాంటి అటాక్ అయ్యాయని.. దీంతో కాస్త వీక్ అయ్యారే కానీ తన కొడుక్కి ఏం కాలేదన్నారు. త్వరలో తన కొడుకు మునుపటి మాదిరి కండల వీరుడి మాదిరి తిరిగి వస్తాడని చెబుతున్నారు సురేశ్ బాబు. ఇదే విషయం ముందే చెప్పేసి ఉంటే.. మధ్యలో ఇంత లొల్లి జరిగేది కాదు కదా?