Begin typing your search above and press return to search.

ఏపీ సినిమా టికెట్ రేట్ల అంశంపై సురేష్ బాబు స్పందన..!

By:  Tupaki Desk   |   27 Nov 2021 9:31 AM GMT
ఏపీ సినిమా టికెట్ రేట్ల అంశంపై సురేష్ బాబు స్పందన..!
X
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపిన కీలకమైన సినిమాటోగ్రఫీ రెగ్యులరైజేషన్ ఎమెండ్మెంట్ బిల్లు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని ప్రతిపాదిస్తూ.. సినిమా థియేటర్లలో కేవలం నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించాలని పేర్కొంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఇకపై నాలుగు షో లు మాత్రమే వేయాలని.. అదనపు షోలకు అవకాశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రజలలు తక్కువ ధరలకే వినోదం అందుబాటులో ఉండాలని.. అందుకే అన్ని సినిమాలకు ఒకే టికెట్ ధరలు ఉండాలని నిర్ణయించింది. అయితే బెనిఫిట్ షోలు - సినిమా టికెట్ రేట్స్ పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది.

ఇప్పటికే టాలీవుడ్ సీనియర్ హీరో చిరంజీవి ట్విట్టర్ వేదికగా సినిమా టికెట్ రేట్ల విషయంపై పునరాలోచించుకోవాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తగ్గించిన టికెట్ ధరల్ని కాలానుగుణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుందని.. దేశమంతా ఒకటే జీఎస్టీగా ప్రభుత్వాలు పన్నులు తీసుకుంటున్నప్పుడు టికెట్ ధరల్లో అదే వెసులుబాటు ఉండటం సమంజసమని చిరు పేర్కొన్నారు.

ఈ క్రమంలో దీనిపై తాజాగా ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు స్పందించారు. ప్రస్తుత టికెట్ రేట్ల వల్ల నిర్మాతలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. సినిమా టిక్కెట్ రేట్లు పై ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని అన్నారు.

సురేష్ బాబు మాట్లాడుతూ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు రావడమే చాలా కష్టంగా ఉందని.. ఇలాంటి సమయంలో రేట్లు తగ్గిస్తే నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవని.. అసలు సినిమా రిలీజ్ చేసే పరిస్థితే ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.

అలాగే బి, సి సెంటర్స్ లో కనీసం కరెంటు చార్జీలు కూడా వచ్చే అవకాశాలు లేవని.. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే థియేట‌ర్లు మూసుకోవాల్సివ‌స్తుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మార్కెట్లో వ‌స్తువుని బట్టి ఒక్కో రేటు ఉంటుందని.. అలాంటప్పుడు అన్ని వ‌స్తువుల్ని క‌లిపి ఒకే రేటుకి అమ్మాలంటే ఎలా కుదురుతుందని సురేష్ బాబు ప్రశ్నించారు.

పెద్ద సినిమాల బ‌డ్జెట్ వేరు.. చిన్న సినిమాల బ‌డ్జెట్ వేరు. రెండు సినిమాల‌కూ ఒకే రేటు నిర్ణ‌యించడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. ఇలాగైతే భవిష్యత్తులో పెద్ద సినిమాలు భారీగా న‌ష్ట‌పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

టికెట్ రేటు ఇంత అని చెప్ప‌లేం.. థియేట‌ర్లో ప్రేక్ష‌కులను బ‌ల‌వంతంగా కూర్చోబెట్ట‌లేం. ఇష్టం లేకుండా టికెట్ కొనిపించ‌లేం. ఇష్ట‌మొచ్చిన‌వాళ్లు చూస్తారు.. లేదంటే మానేస్తారు. అది కేవలం ప్రేక్ష‌కుడి చేతుల్లో ఉంటుంది. మా సినిమా చూడ‌మ‌ని ఎవ‌రూ నిర్భందించ‌లేరు క‌దా అని సురేష్ బాబు అన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు రెండూ చిత్ర‌ పరిశ్రమని చిన్న‌చూపు చూస్తున్నాయని.. ఇలాగైతే ఇండస్ట్రీ మనుగడ సాధించడం కష్టమవుతుందని పేర్కొన్నారు. ప్రేక్షకులకు అన్ని రకాల వినోదాలు అందుబాటులో ఉన్నాయని.. సినిమా టిక్కెట్ ధరలపై ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని సురేష్ బాబు విజ్ఞప్తి చేశారు.