Begin typing your search above and press return to search.

ఇకపై డబ్బుకు ఆశపడి స్టార్స్‌ ఆ పని చేస్తే జైలుకే..!

By:  Tupaki Desk   |   8 Feb 2020 11:30 AM GMT
ఇకపై డబ్బుకు ఆశపడి స్టార్స్‌ ఆ పని చేస్తే జైలుకే..!
X
సినిమా స్టార్స్‌ మరియు స్టార్‌ క్రీడాకారులకు కోట్ల రూపాయలు ఇచ్చి తమ కంపెనీల ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తున్న కంపెనీలకు కేంద్రం షాక్‌ ఇచ్చింది. యాడ్స్‌ ఇష్టాను సారంగా ఇచ్చి, ప్రజలను మోసం చేసినట్లయితే కఠిన శిక్షలు పడేలా కొత్త చట్టంను తీసుకు వచ్చింది. ఈ క్రీమ్‌ రాసుకుంటే నల్లగా ఉన్న మీరు తెల్లగా అవుతారు.. ఇది తీసుకుంటే మీరు లావు అవుతారు.. అది తాగితే మీకు తెలివి బాగా వస్తుంది అంటూ తమ కంపెనీ బ్రాండ్స్‌ కు స్టార్స్‌ తో సూపర్‌ స్టార్స్‌ తో పబ్లిసిటీ చేస్తున్న కంపెనీలు ఇకపై అలాంటి యాడ్స్‌ ను నిలిపేయాల్సిందే.

ఈమద్య కాలంలో పలానా కంపెనీ యాడ్‌ చూసి ఆ ప్రొడక్ట్‌ ను వాడాను.. కాని యాడ్‌ లో చూపించిన విధంగా నాకు ఆ ప్రోడక్ట్‌ మేలు చేయలేదు అంటూ కేసు నమోదు అవుతున్నాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం 1954 నుండి అమలులో ఉన్న చట్టంలో మార్పులు తీసుకు వచ్చింది. ఇలాంటి మోసపూరిత ప్రకటనలతో తమ ప్రాడెక్ట్స్‌ ను ప్రజల్లోకి తీసుకు వెళ్లే కంపెనీల పై కొరఢా జులిపించే ఉద్దేశ్యం తో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కేంద్రం కొత్త చట్టం ప్రకారం మొదటి సారి అలాంటి అబద్దపు యాడ్స్‌ ను ప్రసారం చేస్తే రెండు సంవత్సరాల జైలు శిక్ష.. 10 లక్షల జరిమానా విధించనున్నారు. మళ్లీ మళ్లీ అదే తప్పును ఆ కంపెనీలు చేస్తే జైలు శిక్ష మరియు జరిమానా పెరుగుతూ పోతుంది. ఆ కంపెనీలకు మాత్రమే కాకుండా ఆ యాడ్స్‌ లో నటించే స్టార్స్‌ లేదా మోడల్స్‌ కు కూడా శిక్ష తప్పదంటూ కేంద్రం తెచ్చిన కొత్త బిల్లులో ఉంది. కంపెనీల మోసపూరిత యాడ్స్‌ లో నటించి మాకు సంబంధం లేదు అంటే ఊరుకునేది లేదట.

స్టార్స్‌ ఖచ్చితంగా పూర్తి సమాచారం తోనే యాడ్స్‌ లో నటించాలని లేదంటే చిక్కుల్లో పడటం ఖాయం అంటూ న్యాయ నిపుణులు అంటున్నారు. డబ్బుపై ఆశతో మన స్టార్స్‌ వరుసగా యాడ్స్‌ చేస్తూ ఉంటారు. వారు ఇకపై అయినా కాస్త జాగ్రత్త గా ఉంటే మంచిది. లేదంటే జైలుకు వెళ్లే ప్రమాదం కూడా ఉందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.