అశోక్ గల్లా 'హీరో' కు తాత - మేనమామల ప్రశంసలు..!

Fri Jan 14 2022 15:35:32 GMT+0530 (IST)

Superstar Krishna And Mahesh Babu Praises Hero Movie

సూపర్ స్టార్ కృష్ణ మనవడు మహేష్ బాబు మేనల్లుడు మరియు గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా కుమారుడు అశోక్ హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ''హీరో'' అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రేపు శనివారం జనవరి 15 న విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ - ట్రైలర్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. తాజాగా 'హీరో' సినిమా చూసిన మహేష్ బాబు - కృష్ణ వీడియోల ద్వారా తన స్పందన తెలియజేశారు.మహేష్ మాట్లాడుతూ.. ''హీరో సినిమా చూశాను. నాకైతే విపరీతంగా నచ్చేసింది. కష్టపడితే మంచి ప్రతిఫలం వస్తుందని నేనెప్పుడూ నమ్ముతాను. అశోక్ చాలా బాగా నటించాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు.. ఆ కష్టం తెర మీద కనిపిస్తుంది. నాన్న గారికి సంక్రాంతి చాలా కలిసొచ్చింది.. ఆయన నటించిన సినిమాలు చాలా వరకు సంక్రాంతికి రిలీజ్ అయ్యి హిట్టు అందుకున్నాయి. అదే సెంటిమెంట్ నాక్కూడా కలిసి వచ్చింది. ఒక్కడు - సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - సరిలేరు నీకెవ్వరూ ఇవన్నీ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఈ సంక్రాంతికి మా ఫ్యామిలీ నుంచి మరో హీరో పరిచయమవుతున్నాడు. నాన్నగారి అభిమానులు నా అభిమానులు అశోక్ ని సపోర్ట్ చేస్తారని.. 'హీరో' సినిమా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. అశోక్ మరియు శ్రీరామ్ ఆదిత్యతో పాటు మొత్తం చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతున్నాను'' అని పేర్కొన్నారు.

అలానే కృష్ణ మాట్లాడుతూ.. ''అశోక్ గల్లా హీరోగా తెరకెక్కిన చిత్రం జనవరి 15న విడుదలవుతోంది. నేను సినిమా చూసాను. నాకు ఎక్కడా బోర్ అనిపించలేదు. సబ్జెక్ట్ లో నావల్టీ ఉంది. ఇది వరకు ఇలాంటి సబ్జెక్ట్స్ రాలేదు. ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా బాగా తీశారు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. నా అభిమానులు మరియు మహేష్ ఫ్యాన్స్ సినిమా చూసి అశోక్ గల్లా మంచి ఆర్టిస్ట్ అయ్యేలా ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు'' అని అన్నారు.

హీరోగా లాంచ్ అవుతున్న గల్లా అశోక్ కి.. సినిమా విడుదల ముందు మేనమామ మరియు తాత ఆశీస్సులతో పాటు మద్దతు లభించింది. ఈ వీడియోలతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ సపోర్ట్ లభించే అవకాశం ఉంది. మరి రేపు రిలీజ్ అయ్యే ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. కాగా ''హీరో'' చిత్రంలో అశోక్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. జగపతిబాబు - నరేష్ కీలక పాత్రలు పోషించారు. అమర్ రాజా మీడియా & ఎంటర్టైన్మెంట్ పతాకంపై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు.