సునీల్ విలనీ చేస్తే కామెడీ అయిందే..

Mon Jan 27 2020 15:42:02 GMT+0530 (IST)

Sunils Grey Shades in Ravi Tejas Disco Raja

కమెడియన్ సునీల్ పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా మారుతోంది. దివ్యంగా సాగుతున్న కామెడీ కెరీర్‌ను అతను ఒకప్పుడు చేజేతులా దెబ్బ తీసుకున్నాడు. హీరో వేషాల మీద మోజు పడి ఎటూ కాకుండా తయారయ్యాడు. మొదట్లో అతను చేసిన హీరో రోల్స్ బాగానే వర్కవుటయ్యాయి. కానీ ఆ తర్వాత అతను ట్రాక్ తప్పాడు. తనకు సూట్ కాని పాత్రలు సినిమాలు చేసి పూర్తిగా కెరీర్‌ను దెబ్బ తీసుకున్నాడు. రెండేళ్ల కిందటే హీరో వేషాలకు సెలవిచ్చేసి మళ్లీ కామెడీ రోల్స్ ట్రై చేస్తున్నా ఫలితం ఉండట్లేదు. గత రెండు మూడేళ్లలో అతను చేసిన ఏ కామెడీ పాత్రా క్లిక్కవ్వలేదు. ఇంతకుముందు సునీల్‌తో అద్భుతమైన కామెడీ పండించిన దర్శకులు కూడా ఇప్పుడు అతడిని రక్షించలేని పరిస్థిితి లో ఉన్నారు. చివరికి త్రివిక్రమ్ సైతం తన స్నేహితుడి రాతను మార్చలేకపోయాడు.
‘అరవింద సమేత’ ‘అల వైకుంఠపురములో’.. ఇలా వరుసగా తన రెండు సినిమాల్లోనూ సునీల్ కు ఛాన్సులిచ్చాడు త్రివిక్రమ్. కానీ ఆ రెండు చిత్రాల్లోనూ సునీల్ నవ్వించ లేకపోయాడు. ఈ సినిమాలకు ముందు తర్వాత కూడా సునీల్ చాలా సినిమాల్లో కామెడీ రోల్స్ చేశాడు. అవేవీ వర్కవుట్ కాలేదు. ఇలాంటి సమయంలో సునీల్ ఊహించని టర్న్ తీసుకున్నాడు. మాస్ రాజా రవితేజ కొత్త చిత్రం ‘డిస్కో రాజా’లో విలన్ పాత్ర చేశాడు. అతను ఇందు లో విలన్ గా నటించినట్లు సినిమా రిలీజయ్యే వరకు తెలియదు. అసలు సినిమా లో కూడా చివరి 10 నిమిషాల ముందు వరకు ఆ సంకేతాలే కనిపించవు. హీరో పక్కనే ఫ్రెండుగా ఉంటూ కామెడీనే చేస్తాడు సునీల్. కానీ చివర్లో సునీల్ విలన్ అంటూ పెద్ద ట్విస్ట్ ఇస్తారు. ఐతే ఆ ట్విస్టు ఘోరంగా ఫెయిలైంది. ఈ ఎపిసోడ్లో సునీల్ గెటప్ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. అప్పటి దాకా సునీల్ చేసిన కామెడీ నవ్వించ లేదు కానీ.. అతను విలనీ చేయబోతే అది కామెడీ కావడం ఇందు లో అసలు ట్విస్టు.