Begin typing your search above and press return to search.

కమెడియన్ సునీల్ విలన్‌గా ఎంతవరకు మెప్పిస్తాడు..?

By:  Tupaki Desk   |   6 Aug 2020 5:30 PM GMT
కమెడియన్ సునీల్ విలన్‌గా ఎంతవరకు మెప్పిస్తాడు..?
X
నటుడు సునీల్.. తెలుగు ప్రేక్షకులకు కమెడియన్ గా పరిచయమై ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్‌గా ఎదిగిన సునీల్.. ‘అందాల రాముడు’ సినిమాతో హీరో అవతారం ఎత్తాడు. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మర్యాద రామన్న’ సినిమాతో హీరోగా సెటిల్ అయిపోతాడు అనిపించాడు. ఇక ‘మర్యాద రామన్న’ తర్వాత పూలరంగడుతో మీడియం హిట్ అందుకున్న సునీల్.. ఆ తర్వాత చాలా సినిమాలు చేసినప్పటికీ హీరోగా సెటిల్ కాలేకపోయాడు. ఇటు హీరోగా హిట్స్ లేక.. అటు కమెడియన్‌గా అవకాశాలు లేక సునీల్ కెరీర్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

ఇక కాస్త గ్యాప్ తీసుకొని తన ఫ్రెండ్, డైరెక్టర్ తివిక్రమ్ చొరవతో ‘అరవింద సమేత’ సినిమాలో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మళ్లీ కెరీర్‌ మొదలెట్టాడు. ప్రస్తుతం సునీల్ చేతినిండా సినిమాలు ఉన్నాయట. అయితే.. ఇన్నాళ్లు కామెడీతో.. హీరో క్యారెక్టర్లతో అలరించిన సునీల్ ఇప్పుడు విలన్‌గా తన టాలెంట్ ప్రూవ్ చేసుకోబోతున్నాడు. ప్రస్తుతం సునీల్ విలన్‌గా 'కలర్ ఫోటో' అనే కొత్త సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ లో సునీల్ విలనిజం నిండిన పోలీసుగా ఎంట్రీ ఇచ్చాడు. జైల్లో డైలాగ్స్ కూడా సీరియస్ గా పలకడం మనం గమనించవచ్చు.

ఈ సినిమా ద్వారా కమెడియన్ సుహాస్ హీరోగా పరిచయం అవుతుండగా.. తెలుగమ్మాయి చాందిని చౌదరి హీరోయినుగా నటిస్తుంది. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాలను నిర్మించిన అమృత ప్రొడక్షన్స్ ఈ ‘కలర్ ఫోటో' సినిమాను నిర్మిస్తుంది. ఇక యూట్యూబ్ స్టార్ సందీప్ రాజ్ ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు. 1995లో జరిగిన ఓ కాలేజీ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం. కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి టీజర్ లో ఆకట్టుకుంటున్న సునీల్.. సినిమాలో ఆకట్టుకుంటాడా.. లేదా చూడాలి!