సునీల్ ని చెడగొట్టిందెవరో తెలుసా?

Mon Apr 15 2019 11:58:43 GMT+0530 (IST)

Sunil Explains About His Journey in Film Industry

కమెడియన్ నుంచి హీరోగా ఎదిగారు సునీల్. హీరోగా డజను పైగానే సినిమాల్లో నటిస్తే అందులో ఐదారు విజయం సాధించగా - మిగతావి యావరేజ్ లు - ఫ్లాప్ లు.. డిజాస్టర్లు అంటూ రకరకాలుగా చెప్పుకున్నారు. సునీల్ కెరీర్ డౌన్ ఫాల్ గురించి ఓ మెట్టు ఎక్కువే మీడియాలో కథనాలు వచ్చాయి. అసలు నటుడు అవ్వడమే ఒక బోనస్ అనుకుంటే.. అటుపై హీరో అవ్వడం అతి పెద్ద గోల్డ్ మైన్ గిఫ్ట్ లాంటిది. ఇదంతా బోనస్ లైఫ్ అని భావించే సునీల్ పై రకరకాల కామెంట్లు చేస్తూ మీడియా ఇష్టానుసారం రాసేయడంపై నిన్నటిరోజున సునీల్ ఎంతో ఎమోషనల్ గా ఫిలాసఫికల్ టచ్ తో మాట్లాడారు. ఏదో ఝలక్ ఇద్దామని హీరోగా ట్రై చేశానని చెప్పిన సునీల్.. ఆ తర్వాత హీరోగా ఇరికించారనే విధంగానూ అస్పష్టంగా మాట్లాడారు.కమెడియన్ గా చేసుకుంటూ హీరోగా అడపా దడపా తన బాడీ లాంగ్వేజ్ కి జంధ్యాల తరహా స్క్రిప్టులు వస్తే చేయాలని అనుకున్నానని - అయితే తనని నిర్మాతలు స్క్రిప్టులతో లాక్ చేసి ఎటూ వెళ్లనివ్వలేదని వాపోయాడు. అంతేనా.. హీరోగా నటించేప్పుడు.. కమెడియన్ వేషాలేస్తే మా సినిమాలకు డ్యామేజీ జరగదా? అని అడిగిన నిర్మాతలు ఉన్నారట. దాంతో హీరోగానే బుక్కవ్వాల్సి వచ్చేదని విశదంగానే చెప్పారు. సునీల్ చెప్పిన దానిలో అంతరార్థం వెతికితే నిర్మాతలే అతడిని ``హీరోగా లాక్ చేసి`` చెడగొట్టారా? అన్న సందేహం కలిగక మానదు.

అసిస్టెంట్ డైరెక్టర్ గా.. అసిస్టెంట్ డ్యాన్సర్ గా.. డ్యాన్సర్ గా.. ఇలా రకరకాల ఉద్యోగాలు చేసే క్రమంలో నటుడయ్యేందుకు ఎంతగా తపించాడో సునీల్ ఎమోషనల్ గా చెప్పారు. 75 పైసలు పెట్టి సినిమా చూడటం కోసం మూడు పావలాలు పోగేసేందుకు చిల్లర కొట్టువాడి గిఫ్టులు వెనక్కి ఇచ్చిన సందర్భం ఉందని గుర్తు చేసుకున్నారు సునీల్. అసిస్టెంట్ డైరెక్టర్ గా 5000 జీతం అందుకుంటూ.. నా వల్ల కాదేమో అనుకుని.. తెలివిగా తన రూమ్ కి త్రివిక్రమ్ ని లాక్కుని రావడంపైనా హింట్ ఇచ్చారు. స్నేహ ధర్మం .. మంచితనం ఉన్న త్రివిక్రమ్ వల్లనే తాను ఎలా ఎదిగాడో చెప్పారు.

`చిత్రలహరి`తో తిరిగి కమెడియన్ గా జనాలకు కనెక్టయ్యారు. ఇకపై దానిని కాపాడుకునేందుకు వరుసగా నాలుగైదు భారీ చిత్రాలకు కమిటయ్యారు సునీల్. అయినా ఇంకా వెనక్కి లాగేందుకు ఓ రెండు ఆఫర్లు హీరోగా ఉన్నాయట. తాజా ఇంటర్వ్యూలో సునీల్ మాట్లాడుతూ ..``హీరోగా ప్రస్తుతం రెండు కమిట్ మెంట్లు ఉన్నాయి. నేను వద్దు ప్లీజ్ అంటున్నాను. కుదరదు చేయాలని పట్టు బడుతున్నారు నా నిర్మాతలు. మంచి కథ వస్తే చేద్దామని అంటున్నారు. నేను వద్దని అంటున్నా.. కానీ మేం చేసేస్తామని అంటుంటే సరేనని అన్నాను`` అంటూ కాస్త బరువుగానే చెప్పారు. తాను హీరో అవ్వడంపై కానీ.. యాక్షన్ హీరోగా టర్న్ తీసుకోవడంపై కానీ.. 6 ప్యాక్ ప్రయత్నంపై కానీ సునీల్ అస్సలు రిగ్రెట్ అన్నదే ఫీల్ కాలేదెక్కడా. ఇప్పటివరకూ సునీల్ ఇచ్చిన ఏ ఇంటర్వ్యూలోనూ రిగ్రెట్ ఫీల్ కాకపోవడం చెప్పుకోవాల్సిన విషయమే. అవన్నీ సరైన నిర్ణయాలేనని టైమ్ అలా నడిపించిందని ప్రతిసారీ సునీల్ ఇంటర్వ్యూల్లో చెప్పారు. మన చుట్టూ ఉండే సన్నివేశాలు (సిట్యుయేషన్) మనకంటే మోర్ పవర్ ఫుల్. మనం నిమిత్తమాత్రులం మాత్రమేనని సునీల్ ఎంతో స్పష్టంగా చెప్పారు. ఇప్పటికైనా అర్థమైందా రీడర్స్. ఇకపై ఎప్పటికీ సునీల్ పై కామెంట్లు చేయొద్దు. హీరో ఎందుకయ్యావని..?  యాక్షన్ హీరో ఎందుకయ్యావని?  సిక్స్ ప్యాక్ ఎందుకు చేశావని?  సుత్తి ప్రశ్నలు అసలే అడగొద్దు!!! ఎదిగేవాళ్లను కిందికి లాగొద్దు.. పడిపోయిన వాడిని కనీసం బతకనియ్యాలన్న కనీస కామన్ సెన్స్ అయినా ఉండాలి మనకు!!