సుమంత్ రెండో పెళ్లి వార్తలు 'మళ్ళీ మొదలైంది' కి బాగానే ప్లస్ అయ్యాయి..!

Sat Jul 31 2021 12:30:43 GMT+0530 (IST)

Sumant's second wedding news is a good plus

అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా కింగ్ నాగార్జున మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు సుమంత్. 'ప్రేమకథ' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సుమంత్.. 'సత్యం' 'పౌరుడు' 'గౌరీ' 'మధుమాసం' 'గోల్కొండ హైస్కూల్' 'గోదావరి' 'మళ్ళీరావా' వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే 'మళ్ళీరావా' తర్వాత ఆ స్థాయి సక్సెస్ అందుకోకపోవడంతో మార్కెట్ పరంగా కాస్త వెనకబడ్డాడు. అయితే ఈ మధ్య ఉన్నట్టుండి సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు రావడంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు.సుమంత్ కుమార్ వెడ్స్ పవిత్ర అంటూ ఓ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొట్టడంతో ఎక్కడ చూసినా సుమంత్ పేరే వినిపించింది. ఇక రామ్ గోపాల్ వర్మ ఈ మ్యాటర్ లో కలుగజేసుకోవడంతో మరింత వైరల్ అయింది. ఒక పెళ్లే పెంట అయితే మరో పెళ్లి ఏంటయ్యా స్వామి అంటూ ఆర్జీవీ మార్క్ ట్వీట్ తో రచ్చ లేపాడు. ఈ నేపథ్యంలో సుమంత్ కలుగజేసుకొని.. మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదని.. బయట చక్కర్లు కొడుతున్న పెళ్లి పత్రిక తాను ప్రస్తుతం నటిస్తున్న సినిమా నుంచి లీక్ అయిందని ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు.

ఇదే క్రమంలో సుమంత్ - నైనా గంగూలీ హీరోహీరోయిన్లుగా ''మళ్ళీ మొదలైంది'' అనే చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. విడాకుల తర్వాత జీవితం అనే కాన్సెప్ట్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసి సినిమాపై ఆసక్తిని కలిగించారు. ఇక రామ్ గోపాల్ వర్మ సైతం ట్వీట్ చేస్తూ ఇది సినిమా కోసమని క్లియర్ చేసినందుకు థాంక్స్ అని చెబుతూ.. అందరూ 'మళ్ళీ మొదలైంది' చిత్రాన్ని చూడాలని కావాల్సినంత పబ్లిసిటీ చేసి పెట్టాడు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కోసమే ఇలా పెళ్లి పత్రికను బయటకు వదిలారేమో అనే సందేహాలు అందరిలో కలుగుతున్నాయి.

కావాలనే చిత్ర బృందం ప్రమోషన్స్ కోసం ఇలా ప్లాన్ చేశారో లేదా నిజంగానే ఆ వెడ్డింగ్ కార్డ్ లీక్ అయ్యిందో తెలీదు కానీ.. ఇది 'మళ్ళీ మొదలైంది' చిత్రానికి బాగా పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. ఫస్ట్ లుక్ తోనే అందరి దృష్టి ఈ సినిమాపై పడేలా చేసింది. మరి ఈ చిత్రం సుమంత్ కు మరో 'మళ్ళీ రావా' అవుతుందేమో చూడాలి. ఇకపోతే ఈ ఫస్ట్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని నితిన్ - అడవి శేష్ - హను రాఘవపూడి - మంజుల వంటి సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి విషెస్ అందించారు.

కాగా ''మళ్ళీ మొదలైంది'' చిత్రానికి టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగులో ఇప్పటి వరకు చూడని సరికొత్త కథాంశంతో వస్తోందని మేకర్స్ చెబుతున్నారు. రెడ్ సినిమాస్ చరణ్ తేజ్ సమర్పణలో కె. రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడీ సాంగ్స్ స్పెషలిస్ట్ అనుప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. శివ జీఆర్ఎన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఇకపోతే సుమంత్ హీరోగా 'అనగనగా ఒక రౌడీ' అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెరకెక్కుతోంది. మను యజ్ఞ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏక్ ధో తీన్ ప్రొడక్షన్స్ పతాకంపై గార్లపాటి రమేష్ - టిఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. ఇందులో వాల్తేరు శీను అనే ఊర మాస్ పాత్రలో సుమంత్ కనిపించనున్నారు. మార్క్ కె రాబిన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతుండగా.. పవన్ కుమార్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తయ్యిందని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని మేకర్స్ వెల్లడించారు.