Begin typing your search above and press return to search.

పెళ్లి కాదు నా బొందా కాదు.. అదంతా సినిమా కోసమే.. సుమంత్ క్లారిటీ

By:  Tupaki Desk   |   30 July 2021 3:25 AM GMT
పెళ్లి కాదు నా బొందా కాదు.. అదంతా సినిమా కోసమే.. సుమంత్ క్లారిటీ
X
రెండు రోజుల నుంచి మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ టాలీవుడ్ కథానాయకుడు.. అక్కినేని కుటుంబానికి చెందిన సీనియర్ నటుడు సుమంత్ రెండో పెళ్లి చేసుకుంటున్నట్లుగా వార్తలు రావటం.. దీని మీద పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తం కావటం తెలిసిందే. సుమంత్ పెళ్లి చేసుకుంటున్నాడు అనటానికి ఒక శుభలేఖను ఆధారంగా చూపించారు. సినీనటి కీర్తిరెడ్డిని పెళ్లాడిన సుమంత్.. తర్వాతి కాలంలో వారిద్దరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి సుమంత్ విడిగానే ఉంటున్నారు. ఇంతకాలానికి సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకోనున్నారన్న వార్త అందరిలోనూ ఆసక్తి వ్యక్తమైంది.

అయితే.. అదంతా ఉత్తుత్తి పెళ్లి అని.. ఇంకాస్త క్లియర్ గా చెప్పాలంటే అది సినిమా పెళ్లి అన్న విషయాన్ని తాజాగా సుమంత్ క్లారిటీ ఇచ్చారు. పెళ్లి అంటూ రెండు రోజులపాటు హడావుడి జరిగాక.. చావుకబురు చల్లగా అన్నట్లుగా.. మీరు పొరపడుతున్నారు.. నేను కొత్తగా చేస్తున్నప్రాజెక్టుకు సంబంధించిన శుభలేఖ అది. పొరపాటున లీక్ అయ్యింది. దాన్ని మీరంతా తప్పుగా అర్థం చేసుకున్నారంటూ సుమంత్ తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసి షాకిచ్చాడు.

సుమంత్ రెండో పెళ్లి మీద మీడియా.. సోషల్ మీడియా అత్యుత్సాహాన్నిప్రదర్శించిందనే చెప్పాలి. ఆ మాటకు వస్తే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం సుమంత్ పెళ్లి మీద రియాక్టు కావటం తెలిసిందే. సాధారణంగా పెళ్లి అన్నంతనే.. అది రెండోది కానీ మూడోది కానీ ఆల్ ద బెస్టు చెబుతారు. కానీ.. సుమంత్ పెళ్లి వార్తల మీద వర్మ రియాక్టు అవుతూ.. ‘ఒకసారి అయ్యాక కూడా నీకు బుద్ధి రాలేదా? నీ ఖర్మ. ఆ పవిత్ర ఖర్మను అనుభవించండి’ అంటూ సుమంత్ సోషల్ ఖాతాకు ట్యాగ్ చేశాడు. ఒక ట్వీట్ చేస్తే సరిపోదని అనుకున్నాడో ఏమో కానీ.. మరో పోస్టును పెట్టారు.

‘ఒక పెళ్లంటేనే నూరేళ్ల పెంట అయితే.. రెండో పెళ్లి ఎంటయ్యా స్వామి. నా మాట విని మానెయ్యి. పవిత్రగారు మీ జీవితాలను పాడు చేసుకోకండి. తప్పు మీది కాదు. సుమంత్ ది కాదు. తప్పుఆ దౌర్భాగ్యపు వ్యవస్తది’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలతో సంచలనంగా మారారు. ఒకరి ప్రైవేటు లైఫ్ పై వర్మ ఇంతలా రియాక్టు కావటం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తాయి. తాజాగా సుమంత్ తన క్లారిఫికేషన్ ను చిన్నవీడియో ద్వారా ఇచ్చి అందరికి దిమ్మ తిరిగే షాకిచ్చాడు.

త్వరలో తానో కొత్త సినిమాను చేయనున్నానని.. విడాకులు.. పెళ్లి నేపథ్యంలో ఇప్పటివరకు తెలుగు తెర మీద రాని కొత్త కాన్సెప్టుతో సినిమా చేస్తున్నానని.. దానికి సంబంధించిన శుభలేఖ అంటూ స్పష్టం చేశాడు. మరి.. రీల్ పెళ్లి అయితే.. క్లారిఫికేషన్ ఇచ్చేందుకు రెండు రోజులు ఆగటం ఎందుకు? అన్నది మరో ప్రశ్న. చూస్తుంటే.. తమ సినిమా ప్రచారానికి పనికి వస్తుందన్న ఉద్దేశంతో ఈ రీల్ వెడ్డింగ్ కార్డును లీక్ చేసి ఉంటారు. ఎవరో ఒకరు ముందు వెనుకా చూసుకోకుండా సుమంత్ రెండో పెళ్లికి రెఢీ అన్నంతనే.. ఫోలోమని మిగిలిన వాళ్లు సరైన క్రాస్ చెక్ చేసుకోకుండా వార్తలుగా రాసేయటంతో ఇలాంటి పరిస్థితి అని చెప్పక తప్పదు.

మొత్తానికి సుమంత్ రెండో పెళ్లి ఎపిసోడ్ చెప్పిన నీతి ఏమంటే.. అదిగో తోక అంటే ఇదిగో పులి అన్నట్లుగా వస్తున్నాయన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నట్లు చెప్పాలి. నిజానికి సుమంత్ పెళ్లి వార్తను కొమ్ములు తిరిగిన మీడియా సంస్థలు సైతం పబ్లిష్ చేశాయి. వారైనా ఒకసారి క్రాస్ చెక్ చేసి ఉంటే.. ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదేమో?