`పుష్ప 2` కోసం సుకుమార్ పారితోషికం..?!

Sun May 29 2022 07:00:01 GMT+0530 (IST)

Sukumar remuneration pushpa2 movie

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .. నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన రూరల్ డ్రామా `పుష్ప: ది రైజ్` సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగులో రూపొందించిన ఈ సినిమా హిందీ సహా వివిధ భాషలలో డబ్ అయ్యి విడుదలైంది.రంగస్థలం ఫేమ్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. తెలుగు-తమిళం తో పాటు హిందీ బాక్సాఫీస్ వద్ద పుష్ప బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

సక్సెస్ నేపథ్యంలో పుష్ప 2 మొదటి భాగం కంటే చాలా పెద్ద స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మొదటి భాగం అంచనాలకు మించి విజయం సాధించడంతో బడ్జెట్ ను పెంచి యాక్షన్ సీక్వెన్స్‌ని మెరుగుపరిచారు.

పుష్ప: ది రైజ్ తర్వాత దర్శకుడు సుకుమార్ రేంజ్ కూడా అమాంతం మారిపోయింది. క్రియేటివ్ అండ్  టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కు పుష్ప 1 కోసం రూ. 18 కోట్ల పారితోషికం చెల్లించారు. కానీ ఇప్పుడు సీక్వెల్ కోసం దాదాపు రూ. 40 కోట్ల మొత్తాన్ని సుక్కూ ఇంటికి తీసుకువెళ్లే అవకాశం ఉందన్న గుసగుస వినిపిస్తోంది.

ఈ రెమ్యునరేషన్ తో భారతీయ సినీపరిశ్రమలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న దర్శకుల జాబితాలో సుకుమార్ చేరిపోతున్నాడు. పుష్ప- ది రైజ్ ఘనవిజయం సాధించడంలో సుకుమార్ పనితనం ఎంతో గొప్పది. అతడి టెక్నిక్ పెద్ద స్థాయిలో వర్కవుటైంది. ఇప్పుడు పుష్ప 2లో బన్నీని మరో లెవల్ యాక్షన్ స్టార్ గా ఆవిష్కరించనున్నారు.

మొదటి భాగంలో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ .. శ్రీవల్లి పాత్రలో రష్మిక నటించారు. ఈ చిత్రంలో ధనంజయ్- అనసూయ భరద్వాజ్- జగపతి బాబు- ప్రకాష్ రాజ్- హరీష్ ఉత్తమన్- వెన్నెల కిషోర్ సహాయక పాత్రల్లో నటించారు. పుష్ప 2 ఆగస్ట్ 2022లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.