మెగాస్టార్ 153 డైరెక్టర్ గా జాక్ పాట్

Sun Oct 13 2019 12:44:06 GMT+0530 (IST)

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన `ఖైదీనంబర్ 150` చిత్రానికి వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు. మెగాస్టార్ 151వ చిత్రం `సైరా-నరసింహారెడ్డి`కి లక్కీ గయ్ సురేందర్ రెడ్డి అవకాశం దక్కించుకున్నారు. ధృవ చిత్రంతో తానేంటో నిరూపించుకున్న సురేందర్ రెడ్డికి 300 కోట్ల బడ్జెట్ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కించే అదృష్టం వరించింది. మెగాస్టార్ అంతటివాడినే డైరెక్ట్ చేస్తానని సురేందర్ రెడ్డి సైతం ఊహించి ఉండడు. తదుపరి చిరు నటిస్తున్న 152వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేశారు. వరుస బ్లాక్ బస్టర్లతో శివ సంచలనాలు సృష్టిస్తుండడంతో జాక్ పాట్ వరించింది.ఇప్పుడు ఈ లిస్ట్ లో ఇంకో దర్శకుడి పేరు చేరుతోంది. అతడే సుకుమార్. ఈ లెక్కల మాస్టార్ ట్యాలెంట్ ఏమిటో `రంగస్థలం` చిత్రంతో సాలిడ్ గా మరోసారి ప్రూవైంది. ఆర్య ఫ్రాంఛైజీ సహా నాన్నకు ప్రేమతో లాంటి బ్లాక్ బస్టర్ తోనూ సుక్కూ సత్తా చాటాడు. ఇక రామ్ చరణ్ కి అంతకుముందు ఉన్న పాత ఇమేజ్ ని చెరిపేస్తూ రంగస్థలం రూపంలో ఇండస్ట్రీ సెన్సేషనల్ హిట్ నే ఇచ్చాడు. పైగా 100కోట్ల షేర్ క్లబ్ లో చరణ్ పేరును చేర్చాడు. అంతటి ట్యాలెంట్ ఉన్నవాడు కాబట్టే మెగాస్టార్ వెంటనే సుక్కూకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని.. మెగాస్టార్ 153 అతడి ఖాతాలో పడినట్టేనని వినిపిస్తోంది.

రంగస్థలం హీరో రామ్ చరణ్ చొరవతో సుక్కూకి ఈ ఛాన్స్ దక్కిందట. ఇక మెగాస్టార్ 152వ చిత్రం సైరాను నిర్మించిన రామ్ చరణ్ ఆ చిత్రాన్ని నిర్మిస్తారు. అయితే ఇది ఓ మలయాళ చిత్రానికి రీమేక్. మోహన్ లాల్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ `లూసిఫర్`కి రీమేక్ అని ప్రచారం అవుతోంది. మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టు.. తెలుగు నేటివిటీకి అనువర్తిస్తూ ఏపీ పొలిటికల్ సిట్యుయేషన్ కి తగ్గట్టుగా కథాంశాన్ని మార్చి తెరకెక్కిస్తారట. అయితే సుకుమార్ ఎంపికకు సంబంధించి కొణిదెల కాంపౌండ్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. ప్రస్తుతం ఫిలింనగర్ లో సాగుతున్న గుసగుసలివి.