సుకుమార్ కు 2019 అలా ఉందట!

Wed Jan 16 2019 22:36:48 GMT+0530 (IST)

Sukumar Busy With His Upcoming FIlms

'రంగస్థలం' తో బ్లాక్ బస్టర్ సాధించి తన సత్తాను మరోసారి చాటుకున్న స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ ఏడాది ఊపిరిసలపనంత బిజీగా ఉంటాడట. మామూలుగా అయితే సుక్కు జక్కన్న టైపు.  ఒక కథను తీరిగ్గా చెక్కుతాడు. సినిమాను అంతకంటే తీరిగ్గా మెరుగులు దిద్దుతాడు. అనుకున్న సమయానికంటే కాస్త ఆలస్యంగా సినిమాను రిలీజ్ చేయడం కూడా ఆయినకు అలవాటే. అవేమీ మనం తప్పుగా అనుకోలేం.. ఎందుకంటే క్వాలిటీ ఆ రేంజ్ లో ఉంటుంది మరి.మరి ఇలాంటి సుకుమార్ ఎందుకు అంత బిజీగా ఉండబోతున్నాడు అంటే.. ఒకవైపు మహేష్ బాబు సినిమా మరోవైపు తన శిష్యులతో నిర్మించే సినిమాలతో బిజీగా ఉంటాడట.  ఈ విషయం ఎవరో కాదు సుకుమారే స్వయంగా చెప్పాడు.  సంక్రాంతి పండగ సందర్భంగా సుకుమార్ తన సొంత ఊరైన మాలికిపురానికి వెళ్ళాడు.  అక్కడ మీడియాతో ముచ్చటిస్తూ అయన తన ప్రాజెక్టుల గురించి చెప్పుకొచ్చారు. మహేష్ బాబు సినిమాతో పాటుగా మరో నాలుగు సినిమాలతో బిజీగా ఉంటానని చెప్పాడు.

సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం చేస్తూ సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను సుకుమార్ - మైత్రి మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరో సినిమాలో నాగశౌర్య హీరో కాగా సుకుమార్ శిష్యుడు కాశి రెడ్డి దర్శకుడు. ఈ సినిమాకు సుకుమార్ తో పాటు మైత్రీ మూవీ మేకర్స్.. గీతా ఆర్ట్స్ వారు నిర్మాతలు.  మూడో సినిమాను 'కుమారి 21 F' దర్శకుడు ప్రతాప్ తెరకెక్కిస్తున్నాడు.  ఈ సినిమాక్కూడా సుక్కునే నిర్మాత.  ఈ మూడు కాకుండా మరోటికూడా లైన్లో పెట్టాడట. ఇంకా టైమ్ ఎక్కడ ఉంటుంది చెప్పండి?