మామయ్య డైలాగ్ తో బర్త్ డే విషెస్ తెలిపిన అల్లుడు..!

Sun May 31 2020 10:51:35 GMT+0530 (IST)

Sudheer Babu birthday Wishes to SuperStar Krishna

సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా.. మహేష్ బాబు బావగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు సుధీర్ బాబు. కెరీర్ ప్రారంభం నుండి విలక్షణమైన పాత్రలను.. కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పరుచుకున్నాడు సుధీర్ బాబు. ఈ మధ్య మైండ్ బ్లోయింగ్ స్టంట్ చేస్తూ వీడియో పోస్టు చేసిన సుధీర్ ఇప్పుడు తాజాగా నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ డైలాగ్ చెప్తూ అందర్నీ అబ్బురపరిచాడు. ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ 76వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన బర్త్ డే సందర్భంగా అభిమానులు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో సుధీర్ బాబు తన మామయ్య సూపర్ కృష్ణకి ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ తెలిపారు.''ఇది జస్ట్ సూపర్ స్టార్ కి ఫ్యాన్ బాయ్ ట్రిబ్యూట్.. తన లెజెండరీ కెరీర్లో ఇది నా మోస్ట్ ఫేవరేట్ సీన్.. హ్యాపీ బర్త్ డే మామయ్య'' అంటూ ట్వీట్ చేసారు. అంతేకాకుండా కృష్ణ నటించిన 'అల్లూరి సీతారామరాజు' సినిమాలోని ''ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు.. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు సమూహ శక్తి.. సంగ్రామ భేరి.. స్వాతంత్ర్య నినాదం..'' అనే డైలాగ్ చెప్పే వీడియో జత చేసాడు. కృష్ణ డైలాగ్ చెబుతున్న వీడియోని పక్కన జతచేసి డబ్బింగ్ చెబుతున్నట్లుగా సుధీర్ బాబు ఈ డైలాగ్ ను చెప్పారు. ఆయన మాదిరిగానే అవే హావభావాలతో.. ఒకే టైమింగ్ తో చెప్పడానికి ట్రై చేసాడు. సుధీర్ బాబు తన మామయ్య మీద ఉన్న అభిమానాన్ని ఈ వీడియో షేర్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇంతకముందు కృష్ణ బర్త్ డే సంధర్భంగా కామన్ డీపీ ట్విట్టర్ లో రిలీజ్ చేస్తూ ''మీరు సినీ ఇండస్ట్రీలో ఉండటం.. నా లైఫ్ లో ఉండటం నేను అదృష్టవంతుడిగా ఫీల్ అవుతున్నాను'' అని ట్వీట్ చేసాడు. కాగా సుధీర్ బాబు ఆయనకి అల్లుడు కాకముందే కృష్ణ కి పెద్ద ఫ్యాన్ అని అనేక సందర్భాల్లో చెప్పాడు. కృష్ణ కుమార్తె ప్రియదర్శిని పెళ్లి చేసుకుని సూపర్ స్టార్ అల్లుడు అయ్యాడు సుధీర్. ఆ తర్వాత ఏమాయ చేసావే సినిమాలో చిన్న పాత్ర పోషించి 'ఎస్సెమ్మెస్' సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలను చేసుకుంటూ తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం సుధీర్ బాబు - నానితో కలిసి నటించిన 'వి' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇండస్ట్రీలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా వాయిదా పడింది.