ఆచితూచి అడుగులు వేస్తున్న సూపర్ స్టార్ అల్లుడు..!

Mon Jan 25 2021 11:47:46 GMT+0530 (IST)

Sudheer Babu Upcoming Movie Updates

నటశేఖర కృష్ణ అల్లుడిగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు బావగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుధీర్ బాబు.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ హిట్స్ అందుకుంటున్నాడు. గతేడాది ఓటీటీలో రిలీజైన 'వి' సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సుధీర్ బాబుకు మాత్రం మంచి పేరే తెచ్చిపెట్టింది. అందుకే ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో మరో సినిమా చేస్తున్నాడు. సుధీర్ బాబు సమర్పణలో బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా రానున్న ఈ చిత్రాన్ని బి.మహేంద్రబాబు - కిరణ్ బాలపల్లి నిర్మించనున్నారు. అయితే దీని కంటే ముందే 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాతో తనకంటూ మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలన్నది సుధీర్ ప్లాన్ అని తెలుస్తోంది.'పలాస 1978' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ ఉంది. 70ఎమ్.ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా - శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తన ఫ్రెండ్ నిర్మిస్తున్న 'శ్రీదేవి సోడా సెంటర్' విషయంలో సుధీర్ అన్నీ తానై జాగ్రత్తగా చూసుకుంటున్నాడని తెలుస్తోంది. అలానే బడ్జెట్ ఓవర్ కాకుండా ఈ సినిమాకు సంబంధించిన ఫైనాన్స్ కంట్రోల్ విషయంలో కూడా సుధీర్ బాబు హ్యాండ్ ఉందని టాక్. ఇలా తాను నటించే రెండు సినిమాల్లో ఒక దానికి ప్రొడ్యూసర్ గా మరో దానికి ప్రొడక్షన్ కంట్రోలర్ గా సుధీర్ బాబు వ్యవహరిస్తున్నాడని అంటున్నారు. ఏదేమైనా ఈ రెండు సినిమాలతో సుధీర్ బాబు నెక్స్ట్ లెవల్ హీరోల సరసన చేరుతాడని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.