Begin typing your search above and press return to search.

లైటింగ్ సూరిబాబు ప్రేయసి సోడాల శ్రీదేవి వచ్చేసింది..!

By:  Tupaki Desk   |   30 July 2021 5:22 AM GMT
లైటింగ్ సూరిబాబు ప్రేయసి సోడాల శ్రీదేవి వచ్చేసింది..!
X
వైవిధ్య‌మైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు.. ప్రస్తుతం ''శ్రీదేవి సోడా సెంట‌ర్‌'' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'పలాస 1978' ఫేమ్ కరుణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టైటిల్ తోనే ఆసక్తిని కలిగించిన ఈ సినిమా.. ఫస్ట్ లుక్ - గ్లిమ్స్ తో విప‌రీత‌మైన క్రేజ్ తెచ్చుకుంది. అలానే ఇటీవల విడుదల చేసిన 'మందులోడా' మాస్ కా బాస్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో హీరోయిన్ 'సోడాల శ్రీదేవి' పాత్రకు సంబంధించిన ఇంట్రో వీడియోని రిలీజ్ చిత్ర బృందం రిలీజ్ చేశారు.

'శ్రీదేవి సోడా సెంట‌ర్‌' చిత్రంలో సోడాల శ్రీదేవి పాత్రలో ఆనంది కనిపిస్తోంది. ఈ ఇంట్రో వీడియోలో శ్రీదేవి వద్దకు మన లైటింగ్ సూరిబాబు వెళ్లి సోడా తాగుతుండగా.. 'గోలీ గొంతులోకి దిగుద్ది జాగ్రత్త' అని అమ్మడు హెచ్చరిస్తోంది. అలానే సోడాల శ్రీదేవి ఇక్కడ అంటూ ఆకతాయిని శ్రీదేవి కొట్టడం కూడా చూపించారు. 'నీలాగే ఒకడు సోడా సోడా అని తిరిగితే, సోడా తీసి వాడి నెత్తి మీద కొట్టా.. అప్పటి నుంచి అందరూ నన్ను సోడాల శ్రీదేవి అంటున్నారు' అంటూ సూరిబాబు కు వార్నింగ్ కూడా ఇస్తోంది. ఊర మాస్ లైటింగ్ సూరిబాబుకు తగ్గట్లుగానే అతడి ప్రేయసి సోడాల శ్రీదేవి కూడా డేర్ అండ్ డాషింగ్ అని ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది.

'ఈరోజు' 'బస్ స్టాప్' వంటి తెలుగు చిత్రాలతో పరిచయమైన ఆనంది.. తమిళ నాట స్టార్ స్టేటస్ అందుకుంది. అక్కడ వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉండే ఆనంది.. ఇటీవల 'జాంబిరెడ్డి' సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు సుధీర్ బాబు - కరుణ కుమార్ కలిసి చేస్తున్న 'శ్రీదేవి సోడా సెంట‌ర్‌' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది ఆనంది. ఈ బ్యూటీకి ఈ సినిమా ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో చూడాలి.

కాగా, 'భ‌లేమంచిరోజు' 'ఆనందో బ్ర‌హ్మ‌' 'యాత్ర' లాంటి బ్లాక్‌ బ‌స్ట‌ర్ చిత్రాలను అందించిన 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్ పై ''శ్రీదేవి సోడా సెంట‌ర్‌'' సినిమా రూపొందుతోంది. విజ‌య్ చిల్లా - శ‌శి దేవిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో పావెల్ నవగీతన్ - నరేష్ - సత్యం రాజేష్ - రఘుబాబు - అజయ్ - హర్షవర్ధన్ - సప్తగిరి - రోహిణి ఇతర పాత్రలు పోషిస్తున్నారు.