Begin typing your search above and press return to search.

మోడీకి సుధా చంద్రన్ ట్విట్.. ఎట్టకేలకు సారీ చెప్పిన సీఐఎస్ఎఫ్

By:  Tupaki Desk   |   23 Oct 2021 12:30 AM GMT
మోడీకి సుధా చంద్రన్ ట్విట్.. ఎట్టకేలకు సారీ చెప్పిన సీఐఎస్ఎఫ్
X
రూల్ బుక్ ను ఫాలో కావటం తప్పేం కాదు. కానీ.. రూల్ బుక్ లోని రూల్ తో పాటు.. అధికారులు కొందరు విచక్షణ మరిచి.. పైత్యాన్ని ప్రదర్శించే వైనం.. పలువురికి పెద్ద ఇబ్బందికరంగా మారుతుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. అయితే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రధాని మోడీకి సదరు నటి కమ్ సెలబ్రిటీ ట్వీట్ చేశారు. అప్పటివరకు మొండితనంగా వ్యవహరించిన కేంద్ర భద్రతా సంస్థకు చెందిన ఒక విభాగం దిగి వచ్చి.. సదరు సెలబ్రిటీకి సారీ చెప్పి చెంపలేసుకుంది. ఇంతకూ ఆ నటి కమ్ సెలబ్రిటీ మరెవరో కాదు.. నాట్య రంగంలో పేరు ప్రఖ్యాతులతో పాటు.. నటిగా ఇప్పటికే తనను తాను ఫ్రూవ్ చేసుకున్న సుధా చంద్రన్.

ఎయిర్ పోర్టుకు వెళుతున్న సందర్భంలో సుధా చంద్రన్ కు ఒక ఇబ్బంది తరచూ ఎదురవుతోంది. ఒక యాక్సిడెంట్ లో ఆమె కాలును కోల్పోవటం.. దాని స్థానే జైపూర్ కాలును పెట్టటం.. దాంతో ఆమె నాట్యం చేసి మెప్పించటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎక్కడైనా ప్రోగ్రాంలో పాల్గొని ఎయిర్ పోర్టుకు వచ్చినంతనే.. అక్కడి సెక్యురిటీ సిబ్బంది ఆమె పెట్టుడు కాలును విడి చేసి చూపించాలని కోరుతున్నారు. దీంతో ఆమె తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆమె ప్రధాని నరేంద్ర మోడీకి ఒక ట్వీట్ చేశారు. ఎయిర్ పోర్టుకు వెళ్లిన ప్రతిసారీ తాను తీవ్రమైన అవమానాలు.. ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా వాపోయారు. తన లాంటి వారికి ప్రత్యేక గుర్తింపుకార్డులు మంజూరు చేయాలన్నారు. తన లాంటి వారు తరచూ ప్రయాణాలు చేయాల్సి ఉంటుందని.. అలాంటి సందర్భాల్లో తీవ్రమైన ఇబ్బందుల్ని తాను ఎదుర్కొంటున్నట్లు ఆమె వాపోయారు.

పెట్టుడు కాళ్లలో పేలుడు పదార్థాలు తీసుకొస్తారన్న సందేహం ఉంటుంది కాబట్టి సంబంధిత అధికారులు తనిఖీ చేసుకోవచ్చని.. తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే.. ఎయిర్ పోర్టుకు వెళ్లిన ప్రతిసారీ సీఐఎన్ఎఫ్ అధికారులు తనిఖీ చేయటాన్ని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి తీరు మహిళలకు చాలా ఇబ్బందికరమని సుధా పేర్కొన్నారు. తన వాదనకు బలం చేకూరేలా ఆమె వీడియోల్ని కూడా జత చేశారు.

ఈ ఘాటు ట్వీట్ కు సీఐఎస్ఎఫ్ తాజాగా స్పందించింది. సుధా చంద్రన్ కు కలిగిన అసౌకర్యానికి మన్నించాలని కోరింది. ప్రోటోకాల్ ప్రకారం అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే తనిఖీ చేయాలని పేర్కొన్నారు..అందుకు భిన్నంగా మహిళా భద్రతా సిబ్బంది ఇలాంటి చేయాల్సిన అవసరం ఏముందో తాము తెలుసుకుంటామని చెప్పారు. ఇలాంటి ఇబ్బంది మరోసారి రిపీట్ కాదని స్పష్టం చేసిన అధికారులు.. ఇలాంటి అంశాల మీద సిబ్బందికి ఆవగాహన కల్పిస్తామని బదులివ్వటం గమనార్హం.