సౌత్ హీరోకు సల్మాన్ సంచలన ఆఫర్

Tue Mar 26 2019 19:32:35 GMT+0530 (IST)

Sudeep Villain for Salman Khan Dabangg 3 Movie

సల్మాన్ ఖాన్ కు 'దబాంగ్' చిత్రం అంటే అమితమైన ఆసక్తి - ఇష్టం అనే విషయం తెల్సిందే. సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే నిలిచిపోయే సినిమా 'దబాంగ్'. ఆ చిత్రం హిందీలో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే కొన్నాళ్ల క్రితం తమ్ముడు అర్బాజ్ ఖాన్ దర్శకత్వంలో సల్మాన్ దబాంగ్ 2 అంటూ సీక్వెల్ కూడా చేసిన విషయం తెల్సిందే. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయినా కూడా సల్మాన్ కు దబాంగ్ లోని హీరో పాత్రపై మోజు తగ్గలేదు. అందుకే మరోసారి దబాంగ్ సీక్వెల్ చేయాలని సల్మాన్ ఆసక్తిని చూపించాడు. ఈసారి పూర్తిగా విభిన్నమైన కథతో హీరో పాత్రను మాత్రమే తీసుకుని సీక్వెల్ చేయాలని సల్మాన్ భావిస్తున్నాడు.సీక్వెల్ బాధ్యతలను ఈసారి సౌత్ సినీ స్టార్ - డైరెక్టర్ ప్రభుదేవాకు అప్పగించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో సుదీప్ విలన్ గా కనిపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సుదీప్ ఈ చిత్రంలో విలన్ కాదని - హీరోగానే కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరో సినిమాలో మరో హీరోగా నటించే అవకాశం అంటే అది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఛాన్స్ గా చెప్పుకోవచ్చు. బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్స్ ఆయనతో నటించేందుకు ఆసక్తి చూపిస్తారు. కాని ఆయన మాత్రం సుదీప్ నే తన సినిమాలో అనుకుంటున్నాడు. కథలో చాలా కీలకమైన పాత్రను సుదీప్ పోషిస్తున్నాడని అతడి పాత్ర షాకింగ్ గా ఉంటుందని బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. దబాంగ్ 3లో సుదీప్ కూడా హీరోగా నటించడం సౌత్ ఆడియన్స్ కు సర్ ప్రైజింగ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు.