Begin typing your search above and press return to search.

1000 రోజులు ఆడిన స‌క్సెస్ ఫుల్ చిత్రాలివే

By:  Tupaki Desk   |   17 Sep 2021 1:30 AM GMT
1000 రోజులు ఆడిన స‌క్సెస్ ఫుల్ చిత్రాలివే
X
50 రోజులు 100రోజులు ఆడే సినిమాలే లేవు ఇప్పుడు. ఆ రోజులు పోయాయ‌న్న‌ది అంద‌రికీ తెలిసిన వాస్త‌వం. ఎప్పుడు వ‌చ్చాం.. ఎంత తెచ్చాం? అన్న‌ది ఇప్పుడు లెక్క‌. మ‌హా అయితే సినిమా వారం రోజుల్లోనే వీలైంత‌న వ‌సూలు చేస్తుంది. లేదంటే ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోయింద‌నే నిర్ధారించుకోవాల్సిందే. సినిమా లెక్క‌లు పూర్తిగా మారిన రోజులివి. తొలి వీకెండ్ నాటికే రిజ‌ల్ట్ ప‌క్కాగా తేలిపోతోంది.

థియేట‌ర్ల వ‌ద్ద క్యూ క‌ట్టే రోజులు లేవు. థియేట‌ర్ల‌ని అలంక‌రించ‌డం.. ఫ్లెక్సీలు క‌ట్ట‌డం వ‌ర‌కూ ఓకే కానీ.. స్టార్ హీరోల‌ సినిమా ఏడాది ఆడింది! ఏడాదిన్న‌ర ఆడింది వంటి మాట‌లు కాలంతో పాటే ఎప్పుడో చెల్లిపోయాయి. కానీ ఇలాంటి సంద‌ర్భంలో 1000 రోజులు ఆడిన గోల్డెన్ డేస్ ఏవైనా ఉన్నాయా? అన్న‌ది ఆరా తీస్తే..!

అలా ఓసారి టాలీవుడ్ చ‌రిత్ర‌లోకి వెళ్తే 100 రోజులు...150 రోజులు..175 రోజులు ఆడిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇంకా గ‌తంలోకి వెళ్తే 500రోజులు..1000 రోజులు ఆడిన చిత్రాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి మాట్లాకుంటే ఆస‌క్తిక‌ర సంగ‌తులే ఉన్నాయి.

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన `లెజెండ్` భారీ విజ‌యాన్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్రొద్దుటూరులో అర్చ‌నా థియేట‌ర్లో ఏకంగా 1005 రోజులు దిగ్విజ‌యంగా ఆడింది. అలాగే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `మ‌గ‌ధీర` క‌ర్నూలులో ని ఓ థియేట‌ర్లో 1001 రోజులు ప్ర‌ద‌ర్శిత‌మైంది. అంత‌కు ముందు సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `పోకిరి` ఇండ‌స్ర్టీ రికార్డుల‌ను తిర‌గ‌రాసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కూడా క‌ర్నూలు లో ఓ ఫేమ‌స్ థియేట‌ర్లో 1000 రోజులు ఆడింది.

ఇంకా ఓల్డ్ క్లాసిక్ చిత్రాల్లోకి వెళ్తే..బాల‌కృష్ణ‌..సుహాసిని..భానుమ‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన `మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు` చిత్రం 1984 లో కాచీగూడ‌లోని తార‌క‌రం అనే థియేట‌ర్లో ఏకంగా 567 రోజులు ఆడి అప్ప‌ట్లో రికార్డు సృష్టించింది.ఈ చిత్రానికి కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అలాగే క‌మ‌ల్ హాస‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం `మ‌రో చరిత్ర‌` 1978 లో చెన్నైలోని ఓ థియేట‌ర్లో 556 రోజులు ఆడింది. ఈ చిత్రానికి కె. బాల‌చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఏఎన్నార్ న‌టించిన `ప్రేమాభిషేకం` 1981 లో గుంటూరు.. నెల్లూరు.. విశాఖ‌ప‌ట్ట‌ణంలో ఏకంగా మూడు చోట్ల 553 రోజులు స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అయింది. అలాగే న‌ట సార్వభౌమ ఎన్టీఆర్.. అంజ‌లి జంట‌గా సి. పుల్ల‌య్య తెర‌కెక్కించిన ల‌వ‌కుశ 1963 లో 469 రోజులు ఆడింది. అప్ప‌ట్లో చాలా సినిమాలు క‌నీసం 20 సెంట‌ర్ల‌లో అయినా 100 రోజులు సునాయాసంగా ఆడిన‌వి ఉన్నాయి.

ఇటీవ‌ల ఏపీ మంత్రి పేర్ని నాని రూ.200 కోట్ల వ‌సూళ్లు అంటూ పోస్ట‌ర్ పై వేస్తే.. ఆ సినిమా నుంచి క‌నీసం 25 కోట్లు అయినా ప‌న్ను వ‌సూల‌వ్వాల‌ని కండీష‌న్ పెట్టారు. ఇక ఏ సినిమా పోస్ట‌ర్ పై అయినా 100 కోట్లు 200కోట్లు క‌నిపించ‌డం క‌ష్ట‌మే. ఇక‌పై బంప‌ర్ హిట్టు కొట్టి 100 రోజులు ఆడినా దానిని ఇక బ‌య‌టికి చెప్ప‌లేరు. ఇదంతా మారిన రోజులకు చిహ్నం. సినీరంగంలో ఎన్నో విప్ల‌వాత్మ‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవ‌ల ఓటీటీల ప్ర‌వేశంతో థియేట‌ర్ల‌కు వెళ్లే జ‌నం ప‌రిమిత‌మ‌వుతున్నారు. ఇంత‌కుముందులా ఇంటిల్లిపాదీ థియేట‌ర్ల‌కు వెళ్లేది త‌క్కువే. దీని ప్ర‌భావం వ‌సూళ్ల పై తీవ్రంగానే ప‌డుతోంది.