క్రైసిస్ లోనూ రెండు బ్లాక్ బస్టర్లు ఆయన ఖాతాలో!

Wed Jan 26 2022 08:00:01 GMT+0530 (IST)

Success Of Balayya And Bunny Ends Up As Profit For Dil Raju

ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవం మాస్టర్ మైండ్ క్వాలిటీస్ కొందరికే సొంతం. కరోనా క్రైసిస్ లోనూ లాభాలు ఘడించడమెలానో కొందరికే తెలుసు. దిల్ రాజు తెలివైన నిర్మాతనే కాదు అంతకు మించి గొప్ప డిస్ట్రిబ్యూటర్. పంపిణీదారుడిగా ఆయన నష్టాలు చూసింది చాలా తక్కువ సందర్భాల్లోనే. టాలీవుడ్ లో అగ్ర  నిర్మాతగా కొనసాగుతున్నా...ఆయన ఇంకా డిస్ట్రిబ్యూషన్ మాత్రం వదిలిపెట్టలేదు. నైజాం..వైజాగ్ ఏరియాల్లో ఆయన స్వయంగా సినిమాల్ని రిలీజ్ చేస్తారు. తన సొంత సినిమాలతో పాటు.. బయట బ్యానర్ల  సినిమాల్ని  సైతం రిలీజ్ చేసి సక్సెస్ అందుకోవడం రాజుగారి ప్రత్యేకత. పంపిణీ రంగంలో రాజుగారిది అందవేసిన చేయి. ఆయన పట్టిందల్లా బంగారమే. మధ్యలో ఒడిదుడుకులు ఎన్ని ఉన్నా తట్టుకునేంత స్థ్వైర్యం.. ఫండింగ్ ఆయనకు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన `అఖండ`..`పుష్ప` చిత్రాలు ఆయనకు మంచి లాభాలు తీసుకొచ్చాయి.`అఖండ` నైజాం హక్కుల్ను  10 కోట్లు వెచ్చించారు. ఈ ఒక్క ఏరియా నుంచి `అఖండ` 20 కోట్ల వరకూ షేర్ తెచ్చింది. ఇక `పుష్ప` హక్కులకి 36 కోట్లు పెట్టారు. నైజాం షేర్ 40 కోట్లు దాకా వచ్చింది. వాస్తవానికి బాలయ్య ఇమేజ్ నైజాం లో అంతంగా వర్కౌట్ కాదు. కానీ అఖండ ఊహించని వసూళ్లను రాబట్టింది. ఇక్కడ `పుష్ప` బ్రేక్ ఈవెన్ కూడా కష్టం అనుకున్నారు. పుష్పకు నెగిటివ్ టాక్ వచ్చినా చివరిగా  బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మొత మోగించింది. మొత్తంగా రెండు సినిమాల ద్వారా రాజుగారు భారీగానే లాభాలు ఆర్జించినట్లు తెలుస్తోంది.

ఇలా సాధ్యం కాని సినిమాల్ని కూడా బాక్సాఫీస్ వద్ద సుసాధ్యం చేసి మరోసారి రాజుగారి మార్క్ వేసారు. సూక్ష్మంలో మోక్షం తెలిసిన నిర్మాత ఇందుకేనని అంగీకరించాలి. రాజుగారు తొలుత పంపిణీదారుడిగానే సినిమా రంగంలోకి ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిర్మాతగా ప్రమోట్  అయ్యారు. ప్రస్తుతం దిల్ రాజు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే బాలీవుడ్ లో అల్లు అరవింద్ తో కలసి నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. `ఇండియన్-2` చిత్రాన్ని రాజుగారే నిర్మించాల్సి ఉండగా చివరి నిమిషంలో డ్రాప్ అయిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ లో ఆర్.సి 15ని నిర్మిస్తూ జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారుతున్నారు.