ఇలా అయితే మూసేస్తాం! వైజాగ్ ఎగ్జిబిటర్ల ఆవేదన!

Wed Jan 19 2022 13:00:01 GMT+0530 (IST)

Strict rules in Vizag theaters

పెరుగుతున్న కోవిడ్ కేసులు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఓమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. అయినా ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల ప్రజలు యథాతథంగా స్వేచ్ఛను ఆస్వాధిస్తున్నారన్న విమర్శలున్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడా నైట్ కర్ఫ్యూలు.. థియేటర్లలో జనం గుమికూడే ప్రదేశాల్లో నిబంధనలు అంటూ చాలా కఠిన నిబంధనలు అమలవుతున్నాయి.ముఖ్యంగా సినిమా థియేటర్లపై కఠిన ఆంక్షల విషయంలో అధికారులు ఎక్కడా తగ్గడం లేదని సమాచారం. ఇప్పటికే విశాఖలో 50శాతం సీటింగ్ తో పాటు శానిటేషన్ .. అనుమతులు అంటూ రకరకాల కండీషన్ల నడుమ థియేటర్లు రన్ అవుతున్నాయి.

అయితే ఈ నిబంధనలు మరింత కఠినతరంగా మారడంతో థియేటర్ యజమానులు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే కోవిడ్ వల్ల సర్వనాశనం అయిన థియేటర్ల రంగం తాజా కండీషన్లకు మరింతగా బలవుతోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. థియేటర్ యజమానులు ఇటీవల తగ్గిన టికెట్ ధరలతో ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు వివిధ నిబంధనల పేరుతో థియేటర్లకు అధికారులు నోటీసులు జారీచేయడం కలకలం రేపుతోంది. ఇలా అయితే థియేటర్లు మూత వేస్తామని చెబుతున్నారు. దివాలా తీయకుండా ఉండాలంటే ప్రభుత్వమే ఆదుకోవాలని కూడా థియేటర్ యాజమాన్యాలు చెబుతున్నాయి.