స్టార్ డమ్ అంత ఈజీ కాదన్న సాగరకన్య

Sun Jul 12 2020 17:00:34 GMT+0530 (IST)

Stardom is not an easy Saying Shilpa setty

సాగరకన్య శిల్పా శెట్టిని తెలుగు అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోగలరా?  తెలుగు సినిమాకి సంబంధించినంత వరకూ మతులు చెడగొట్టే మత్స్యకన్యగా గుండెల్లో స్థిరపడింది. మందాకిని తర్వాత మళ్లీ అంతగా కవ్వించిన ట్రెండీ స్టార్ శిల్పాశెట్టి. టాలీవుడ్ బాలీవుడ్ ని ఏలిన తర్వాత శిల్పాజీ బాంబే డైయింగ్ కంపెనీ అధినేత రాజ్ కుంద్రాని పెళ్లాడి సెటిలైన సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు సంతానం.శిల్పా శెట్టి దాదాపు 27 సంవత్సరాలు హిందీ పరిశ్రమలో నటిగా కొనసాగింది. 1993 లో షారుఖ్ ఖాన్ నటించిన బాజీగర్ చిత్రంతో శిల్పా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అటుపై మెయిన్ ఖిలాడి తు అనారి-ధడ్కన్ -ఇండియన్ - గర్వ్: ప్రైడ్ అండ్ హానర్ -అప్నే -దస్ వంటి అనేక బిగ్ టికెట్ చిత్రాలలో నటించింది. ఫిర్ మిలెంగే - లైఫ్ ఇన్ ఎ… మెట్రో చిత్రాలలో ఆమె నటనకు ప్రత్యేక ప్రశంసలు దక్కాయి.  45 ఏళ్ల శిల్పా టెలివిజన్ రంగంలోనూ ప్రయత్నించింది. 2007 లో బ్రిటన్ లో సెలబ్రిటీ బిగ్ బ్రదర్ గా పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్ రెండు సీజన్ లను హోస్ట్ చేసింది. జరా నాచ్కే దిఖా- నాచ్ బలియే-సూపర్ డాన్సర్ వంటి రియాలిటీ షోల జడ్జిగానూ కొనసాగింది. అటుపై నిర్మాతగా బిజినెస్ ఉమెన్ గా రాణించింది. ఐపీఎల్ క్రికెట్ లీగ్ టీమ్ లను కొనడంలోనూ రాటుదేలింది.

శిల్పాశెట్టి తాజా ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర వ్యాఖ్యను చేశారు. ``స్టార్‌డమ్ అనేది తేలికగా రాదని.. సక్సెస్  కావడానికి చాలా విధాలుగా ప్రయత్నించాలని తెలిపింది. ప్రపంచంలో ఉచిత భోజనం లేదు. కాబట్టి ఏ రంగంలోనైనా విజయం సాధించడానికి ప్రయత్నం తప్పనిసరి`` అని అంది. బాలీవుడ్ లో ప్రయోగాత్మకత పెరిగిందని నాయికా ప్రాధాన్యత మెరుగుపడిందని శిల్పాజీ తెలిపింది. స్వాగతించే మార్పు ఇది. ప్రయోగానికి అనువైన సమయం కూడా ఇదేనని శిల్పా శెట్టి అభిప్రాయపడ్డారు.

2002 లో వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను శిల్పా వివాహం చేసుకున్నారు. వియాన్ వీరి తొలి సంతానం. ఆ తర్వాత సరోగసీలో సమీషా జన్మించింది. 2020 లో సర్రోగసీ ద్వారా బిడ్డను కన్నారు. లైఫ్ లో కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తానని శిల్పా శెట్టి వెల్లడించింది.