టాప్ స్టోరి: స‌్టార్లకు ఈ గాయాల బెడదేంటో?!

Wed Jun 12 2019 07:00:01 GMT+0530 (IST)

Star Heroes Injured On Shooting It Will Effect on Production Cost

ఫలానా స్టార్ హీరోకి ఆన్ లొకేషన్ ప్రమాదం జరిగింది.. పెద్ద గాయమైంది! అనే వార్త అభిమానుల గుండెల్లో కల్లోలం లాంటిది. అంతకుమించి ఇలాంటి గాయాల వల్ల షూటింగులకు జరిగే డిస్ట్రబెన్స్ ఎలా ఉంటుంది? అన్న కోణం పరిశీలిస్తే.. అది ఇంకా ఇబ్బందికరమైనది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. అలాగే ఇన్ టైమ్ లో సినిమా రిలీజ్ కాకపోయినా దాని ప్రభావం ప్రొడక్షన్ పైనా పడుతుంది. మానసికంగానూ అది దర్శకనిర్మాతలకు సెట్ బ్యాక్ అవుతుందనడంలో సందేహం లేదు. కోట్లాది రూపాయల పెట్టుబడుల్ని వెదజల్లి ఆడే జూదంలో ఇలాంటివి చాలా చాలా ఇబ్బందికరమని పలువురు విశ్లేషిస్తున్నారు.ఎస్.ఎస్.రాజమౌళి తరకెక్కిస్తున్న భారీ హిస్టారికల్ ఫిక్షన్ సినిమా ఆర్.ఆర్.ఆర్ సెట్స్ లో ఇరువురు స్టార్ హీరోలకు గాయాలయ్యాయి. ముందుగా రామ్ చరణ్ కి గాయం వల్ల షెడ్యూల్ ని వాయిదా వేశారు. చరణ్ కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుని తిరిగి సెట్స్ లోకి రీజాయిన్ అయ్యారు. అలాగే ఎన్టీఆర్ కి గాయం అవ్వడంతో మరోసారి అలాంటి సన్నివేశమే తలెత్తింది. తారక్ కూడా గాయాల నుంచి కోలుకుని తిరిగి సెట్స్ లోకి జాయిన్ అయ్యారు. అంటే స్టార్లకు గాయాలు అయితే.. ఏం చేయాలి? అన్న ప్లాన్ కూడా దర్శకనిర్మాతలకు ముందస్తుగా ఉండాలని ఈ సన్నివేశం ప్రూవ్ చేసింది. లేదంటే సుదీర్ఘ కాలం షెడ్యూల్స్ వాయిదా పడితే పరిణామం ఊహించగలిగేదే. భారీ బడ్జెట్ చిత్రాలకు ఇది చాలా ఇబ్బందికరం. ఆర్థికంగానూ భారం పెరుగుతుంది.

ఇటీవల ఎగ్రెస్సివ్ హీరో గోపిచంద్ కి ఆన్ లొకేషన్ పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడడంతో ఏకంగా నెలరోజులు పైగానే విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికి గోపిచంద్ కోలుకుని సెట్స్ కి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. గోపిచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇండో పాక్ బార్డర్ నేపథ్యంలో భారీ యాక్షన్ చిత్రమిది. ఇటీవలే చాణక్య అనే టైటిల్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. స్పై థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఎంటర్ టైనర్ ఇది అని చెబుతోంది టీమ్.

ఆ ముగ్గురు స్టార్ హీరోలు గాయాల నుంచి కోలుకుంటున్నారు అనగానే ఇటీవలే నేచురల్ స్టార్ నానీకి గ్యాంగ్ లీడర్ (వర్కింగ్ టైటిల్) సెట్స్ లో గాయమైందని వార్తలొచ్చాయి. చిన్న పాటి గాయమే అయినా వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. అంటే ఆ మేరకు షెడ్యూల్ వాయిదా పడింది. ఇక నానీ గాయం నుంచి కోలుకుని తిరిగి సెట్స్ లో జాయిన్ అయ్యారని తెలుస్తోంది. ఈ శనివారం నుంచి షూటింగ్ జరుగుతోంది. 15 నుంచి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ని కొనసాగించనున్నారట. నాని- విక్రమ్.కె.కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో ఆర్.ఎక్స్ 100 ఫేం కార్తికేయ విలన్ పాత్రలో నటిస్తుండడం ఆసక్తిని పెంచింది. జూలై తొలి వారానికి మొత్తం షూటింగ్ పూర్తి చేయాలన్నది ప్లాన్. అయితే మధ్యలో నానీకి వారం విశ్రాంతి కొంత ఇబ్బందికరమే అయ్యింది. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సాహో రిలీజైన రెండు వారాలకు అంటే.. ఆగస్టు 30న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

ఒకసారి టాలీవుడ్ గతాన్ని పరిశీలిస్తే.. `శివమ్` సెట్స్ లో రామ్ కి గాయమైంది. అతడు కోలుకున్న తర్వాతనే షెడ్యూల్ రీలాంచ్ అయ్యింది. జయేంద్ర దర్శకత్వం వహించిన ఓ సినిమా సెట్స్ లో నందమూరి కళ్యాణ్ రామ్ కి గాయమైంది. అలాగే `మిస్టర్` సెట్స్ లో వరుణ్ తేజ్ కి గాయమైందని ప్రచారమైంది. అలాగే ఇటీవల `కల్కి` సెట్స్ లో యాంగ్రీ హీరో రాజశేఖర్ గాయపడిన సంగతి తెలిసిందే. చిన్నపాటి గాయమేనని రాజశేఖర్ కోలుకున్నారని దానిపై కల్కి టీమ్ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా చూస్తే షూటింగుల్లో రిస్క్ తప్పనిసరి అని అర్థమవుతోంది. స్టార్లు రిస్క్ లేకుండా యాక్షన్ ఎపిసోడ్స్ చేయడం కష్టమే. చిన్నపాటి గాయమైతే ఓకే కానీ పెద్ద గాయం అయితే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కోక తప్పదు. ఆ టెన్షన్ హీరోతో పాటు దర్శకనిర్మాతలకు అనుభవించాల్సి ఉంటుంది. ఇటు టాలీవుడ్ లోనే కాదు అటు బాలీవుడ్ సహా అన్ని పరిశ్రమల్లోనూ ఈ సన్నివేశం తప్పదు. అసాధారణ బడ్జెట్లతో తెరకెక్కే హాలీవుడ్ భారీ యాక్షన్ సినిమాల్లో ప్రాణాలు కోల్పోయేంత పెను ప్రమాదాలు ఎన్నో చూస్తున్నదే.