స్టార్ హీరోలు స్మార్ట్ ఛాన్సులు ఇస్తారా ?

Sat Jul 20 2019 15:00:01 GMT+0530 (IST)

ఇస్మార్ట్ శంకర్ కమర్షియల్ సక్సెస్ దిశగా దూసుకుపోతోంది. వారం పూర్తి కాకుండానే కేవలం నాలుగు రోజులకే పెట్టుబడి వెనక్కు వచ్చే అవకాశం ఉండటంతో బయ్యర్లు హ్యాపీగా ఉన్నట్టు ట్రేడ్ టాక్. పూరి ఈజ్ బ్యాక్ అని అభిమానులు మురిసిపోతుండగా మాస్ మసాలా పేరుతో ఫ్యామిలీ ఆడియెన్స్ దీనికి పూర్తి దూరంగా ఉండేలా పూరి ఇస్మార్ట్ శంకర్ తీర్చిదిద్దాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీటి సంగతి పక్కనపెడితే ఏనాడో పూరిని పక్కన పెట్టేసిన స్టార్ హీరోలు ఇప్పుడు రమ్మని పిలుస్తారా అనే చర్చ ఆసక్తికరంగా మారింది.నిజానికి పూరి తన మేజిక్ కోల్పోయి చాలా కాలమయ్యింది. టెంపర్ మినహాయించి తన స్వంత కథతో హిట్ ఇచ్చి ఏళ్ళు గడిచిపోయాయి. ఇన్నాళ్లకు ఇస్మార్ట్ శంకర్ రూపంలో ఓ చెప్పుకోదగ్గ సక్సెస్ అందింది. అయితే ఇప్పుడు ఇది చూసాక స్టార్లు పూరి కథలను వినేందుకు సిద్ధ పడతారా అనేది భేతాళ ప్రశ్నగా నిలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ ని మాస్ ప్రేక్షకులు పాస్ చేసినా అందులో చాలా లోపాలు స్పష్టంగా ఉన్నాయి.

విలన్ పాత్రను సరైన రీతిలో డిజైన్ చేయకపోవడం - హీరో హీరోయిన్ల మధ్య అంగాంగ ప్రదర్శనే తప్ప ఫీలయ్యే ఎమోషనల్ లవ్ ని ఎస్టాబ్లిష్ చేయకపోవడం - బ్రెయిన్ లో చిప్ పెట్టడం తప్ప మిగిలినదంతా రొటీన్ వ్యవహారంలా సాగిపోవడం పూరి ఈజ్ బ్యాక్ అనే రేంజ్ లో అయితే ముమ్మాటికి లేవు. అలాంటప్పుడు పూరిలోని ఒరిజినల్ స్టొరీ రైటర్ మళ్ళి వచ్చాడు అని చెప్పడానికి లేదు. ఒకవేళ రామ్ ని మించిన స్టార్ తో పూరి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంటే అప్పుడు ఇస్మార్ట్ ప్రభావం ఉందని చెప్పుకోవచ్చు. మాములుగా హిట్ మూవీస్ కి ప్రశంసలు గుప్పిస్తూ ట్వీట్లు వేసే హీరోలు సెలెబ్రిటీలు ఇస్మార్ట్ శంకర్ విషయంలో సైలెంట్ గా ఉండటాన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు