ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిన స్టార్ హీరో సినిమా

Tue Aug 11 2020 12:30:57 GMT+0530 (IST)

Star Hero movie ready for OTT release

బాలీవుడ్ లో చాలా సినిమాలు ఓటీటీ ద్వారా విడుదల అవుతున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకుని చాలా రోజులు అవుతున్న నేపథ్యంలో థియేటర్లు ఓపెన్ కు పరిస్థితి లేని కారణంగా ఓటీటీ రిలీజ్ కు సిద్దం అవుతున్నారు. బాలీవుడ్ లో విడుదల అయినంతగా సౌత్ లో మాత్రం స్టార్ హీరోల సినిమాలు ఓటీటీలో విడుదలకు సిద్దం అవ్వడం లేదు. ఇప్పటి వరకు సౌత్ లో డైరెక్ట్ ఓటీటీలో విడుదల అయిన సినిమాలన్నీ కూడా చిన్న హీరోల సినిమాలు కొత్త హీరో సినిమాలే. మొదటి సారి ఒక స్టార్ హీరో సినిమా ఓటీటీ విడుదలకు సిద్దం అవుతుంది.తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా చిత్రంను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ప్రముఖ ఓటీటీలో అతి త్వరలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా తమిళ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. అందుకే భారీ మొత్తానికి ఈ సినిమాను సదరు ఓటీటీ కొనుగోలు చేసిందని టాక్ వినిపిస్తుంది.

తెలుగు దర్శకురాలు సుధ కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డ్ ఇచ్చింది. కరోనా వచ్చి ఉండకుంటే ఇప్పటి వరకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్దం చేస్తున్న సమయంలో కరోనా వచ్చి సినిమా ఆగిపోయింది. థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యేది ఎప్పుడో తెలియడం లేదు. ఆ కారణంగానే నిర్మాతలు ఆకాశమే నీ హద్దురా సినిమాను ఓటీటీ విడుదలకు రెడీ చేసినట్లుగా చెబుతున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందట.