అదే లేకుంటే స్టార్ హోదా దక్కడానికి మరో 20 ఏళ్లు పట్టేది: రష్మిక

Fri Sep 30 2022 06:00:01 GMT+0530 (India Standard Time)

Star Actress Rashmika Mandhana

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ 'ఛలో' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి ఇక్కడ అతి తక్కువ సమయంలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. ప్రతి చిత్రాన్ని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటూ వరుస హిట్లు ఖాతాలో వేసుకుంటోంది. ఇక గత ఏడాది విడుదలైన 'పుష్ప' సినిమాతో రష్మిక క్రేజ్ డబుల్ అయ్యింది.  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మించారు. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తే.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా చేశాడు.

గత ఏడాది డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. ఈ సినిమాతో రష్మిక  పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హోదా ను దక్కించుకుంది. పైగా ఈ సినిమా తర్వాత రష్మిక సౌత్ లోనే కాదు నార్త్ లోనూ వరుస ఆఫర్లను అందుకుంటూ కెరీర్ పరంగా జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది.

ఇకపోతే' పుష్ప'కు రెండో భాగంగా 'పుష్ప 2' రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసిన సుకుమార్.. రెగ్యులర్ షూటింగ్ కి ముహూర్తం కూడా పెట్టేశారు. అక్టోబర్ రెండో వారం నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అయితే తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించిన రష్మిక.. పుష్ప తొలి భాగం ద్వారా వచ్చిన పేరు ప్రతిష్టల గురించి స్పందించింది.

'పుష్ప సినిమా నాకు చాలా పేరు తీసుకొచ్చింది. సినిమా విడుదలైన రెండు మూడు నెలలు దాకా ఫోన్స్ మేసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. మేము ఊహించిన దానికంటే భారీ విజయాన్ని ఈ సినిమా సాధించి ఆశ్చర్యపరిచింది. ఒకవేళ ఈ సినిమానే లేకుంటే ఇంతటి స్టార్ హోదాను దక్కించుకునేందుకు నాకు మరో 20 ఏళ్ళు పట్టేదేమో' అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.

ఇక 'పుష్ప 2' మరికొద్ది రోజుల్లోనే సెట్స్ మీదకు వెళ్లబోతోందని భారీ అంచనాలను అందుకునేలా ద్వితీయ భాగాన్ని రూపొందిస్తున్నారని రష్మిక వెల్లడించింది. కాగా రష్మిక ఇతర ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. తెలుగులో 'పుష్ప 2' తమిళంలో 'వరిసు' చిత్రాలు చేస్తోంది. అలాగే బాలీవుడ్ లో 'మిషన్ మజ్ను' 'గుడ్ బై' 'యానిమల్' చిత్రాల్లో భాగం అయింది. అయితే వీటిలో 'గుడ్ బై' చిత్రం అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదే బాలీవుడ్ లో విడుదల కాబోతున్న రష్మిక తొలి చిత్రం. ఇందులో బాలీవుడ్ బిగ్ బి అబితాబ్ బచ్చన్ తో రష్మిక స్క్రీన్ షేర్ చేసుకుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.